Akhanda 2 | బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం ‘అఖండ 2’ విడుదలకు కొన్ని గంటల ముందే ప్రీమియర్ షోలు, టికెట్ బుకింగ్స్ ఆకస్మికంగా రద్దు కావడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ పెరిగింది. టీజర్, ట్రైలర్ నుంచే భారీ అంచనాలు పెంచుకున్న బాలయ్య అభిమానులు సోషల్‌మీడియాలో నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ ఎలా చేస్తారు?”, “ఇది ప్లానింగ్ లోపం కాదా?” అంటూ విమర్శిస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ అంటూ విడుదల వాయిదాపై మేకర్స్ ఇచ్చిన వివరణను చాలా మంది నమ్మడం లేదు.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘అఖండ 2’ ఆగిపోవడానికి ప్రధాన కారణం పాత ఆర్థిక వివాదాలే. సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’, అనంతరం వచ్చిన ‘ఆగడు’ చిత్రాలకు ఏరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్ అందించిన సంగతి తెలిసిందే.ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు చవిచూశాయి.దీంతో ఏరోస్ సంస్థకు 14 రీల్స్ సుమారు ₹27–28 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వడ్డీలు కూడా భారీగా చేరడంతో మొత్తం బకాయిలు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఈ బకాయిలను తీర్చకుండా 14 రీల్స్ సంస్థ ‘14 Reels Plus’ అనే కొత్త పేరిట సినిమాలు చేస్తోందని ఆరోపిస్తూ ఏరోస్ లీగల్‌గా కోర్టుకు వెళ్లింది.
ఈ కేసు నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు అఖండ 2 విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. అంటే అసలు సమస్య టెక్నికల్ కాదు,పాత బకాయిలు, లీగల్ కేసులే సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నాయి. తీవ్రమైన ఫైనాన్షియల్ వివాదంపై 14 Reels Plus ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌ను ఇంకా అసహనానికి గురిచేస్తోంది.చివరి నిమిషంలో ఇలా భారీ ప్రాజెక్ట్ ఆగిపోవడం బాలయ్య అభిమానులకే కాదు, మొత్తం ఇండస్ట్రీకే షాక్‌గా మారింది. ఇప్పుడు అందరి చూపు కోర్టుపైనే ఉంది. పెండింగ్ సెటిల్మెంట్లు పూర్తయితే స్టే ఎత్తివేయబడే అవకాశం ఉంది. తరువాతే మేకర్స్ కొత్త విడుదల తేదీ ప్రకటించగలరు. ‘అఖండ 2’ విడుదల వాయిదా వెనుక ఉన్న అసలు నేపథ్యం బయటపడడంతో సినిమాపై ఉన్న గందరగోళం కొత్త మలుపు తిరిగింది. సమస్యలు త్వరగా పరిష్కారమై బాలయ్య మాస్ విజృంభణను చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు