WT20 World cup | ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్ దంచిన మన అమ్మాయిలు మలి మ్యాచ్‌లో వెస్టిండీస్ భరతం పట్టారు. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ ఘన విజయం సొంతం చేసుకున్నారు. తొలుత దీప్తిశర్మ స్పిన్ విజృంభణతో విండీస్ స్వల్ప స్కోరుకే పరిమితం కాగా, లక్ష్యఛేదనలో రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్‌కౌర్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. ఇదే జోరులో ఇంగ్లండ్, ఐర్లాండ్‌పై గెలిస్తే భారత్‌కు సెమీఫైనల్ బెర్తు ఖాయం కానున్నది.
కేప్‌టౌన్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా..మాజీ చాంపియన్ వెస్టిండీస్ పనిపట్టింది. బుధవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా గ్రూపు-2లో ఇంగ్లండ్(4) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నది. సెమీస్ బెర్తు దక్కించుకోవాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన తరుణంలో కౌర్‌సేన సత్తాచాటింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులకే పరిమితమైంది.
స్టార్ స్పిన్నర్ దీప్తిశర్మ(4-0-15-3) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. స్టెఫానీ టేలర్(42), క్యాంప్‌బెల్(30) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు నమోదుచేయలేకపోయారు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో రిచా ఘోష్(44 నాటౌట్), హర్మన్‌ప్రీత్‌కౌర్(33) రాణించడంతో టీమ్ఇండియా 18.1 ఓవర్లలో 119/4 స్కోరు చేసింది. కరీష్మా(2/14) ఆకట్టుకుంది. మూడు కీలక వికెట్లు పడగొట్టిన దీప్తిశర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు శుభారంభం దక్కలేదు. స్కోరుబోర్డుపై నాలుగు పరుగులకే కెప్టెన్ హాలే మాథ్యూస్(2) పెవిలియన్ చేరింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన టేలర్, క్యాంప్‌బెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు భారత బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ కీలక పరుగులు జోడించారు. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో స్టార్ స్పిన్నర్ దీప్తిశర్మ..క్యాంప్‌బెల్‌ను ఔట్ చేసి దెబ్బ తీసింది. దీంతో రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌పడింది. పరుగు తేడాతో టేలర్‌ను కూడా దీప్తి ఔట్ చేయడంతో విండీస్ తిరిగి కోలుకోలేకపోయింది. అప్పటి వరకు భారీ స్కోరుపై అంచనాలు వేసుకున్న విండీస్‌కు భారత్ షాక్ ఇచ్చింది. క్రీజులోకొచ్చిన హెన్రీని మందన సూపర్ త్రోతో వికెట్‌కీపర్ రీచా ఘోష్ ఔట్ చేయడంతో మూడు పరుగుల తేడాతో విండీస్ మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. రేణుకా సింగ్, పూజ వస్ర్తాకర్కు ఒక్కో వికెట్ దక్కింది.
విండీస్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు స్మృతి మందన(10), షఫాలీ వర్మ(28) ఆకట్టుకున్నారు. మెగాటోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన మందన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఓవైపు షఫాలీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తే..మందన బ్యాటు ఝుళిపించలేకపోయింది. గత మ్యాచ్‌లో అర్ధసెంచరీతో అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్(1) ఈసారి సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. ఈ తరుణంలో క్రీజులోకొచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, రిచా ఘోష్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కౌర్ సహాయంతో రిచా టాప్‌గేర్‌లో ఆడింది. విండీస్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో చెలరేగింది. విజయం ఖాయమనుకుంటున్న తరుణంలో కౌర్ ఔటైనా దేవికా వైద్యతో కలిసి రిచా జట్టును గెలుపు తీరాలకు చేర్చింది.
వెస్టిండీస్: 20 ఓవర్లలో 118/6(టేలర్ 42, క్యాంప్‌బెల్ 30, దీప్తిశర్మ 3/15, పూజ 1/21), భారత్: 18.1 ఓవర్లలో 119/4 (రిచా ఘోష్ 44 నాటౌట్, కౌర్ 33, కరిష్మా 2/14, మాథ్యూస్ 1/12).