న్యూఢిల్లీ: ఇప్పటికే దిగుమతులపై 50 శాతం సుంకాలతో కుంగదీసిన అమెరికా.. భారత్‌పై మరో పిడుగు వేయడానికి సిద్ధమవుతున్నది.అమెరికన్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే సేవల కోసం విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలపై 25 శాతం పన్ను విధించేందుకు సిద్ధమవుతున్నది. దీని కోసం హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీ లొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ (హైర్ చట్టం)ను ‘యూఎస్ హైర్ బిల్లు’ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు పలు చర్యలు ప్రారంభించింది. దీనికి చట్టరూపం ఇవ్వడానికి చకచకా అడుగులు వేస్తున్నది. దీని ప్రభావం భారత్‌పైనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలోని ఐటీ పరిశ్రమ చాలామటుకు అమెరికా కాంట్రాక్టుల పైనే ఆధారపడి ఉంది.
అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడాన్ని తగ్గించడానికి, లేదా నిషేధించడానికి ఇప్పుడు అమెరికా సెనెటర్లు ఈ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ చట్టం ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. విదేశీ కార్మికులను నియమించుకునే అమెరికాలోని అన్ని కంపెనీలకు ఈ 25 శాతం పన్ను విధిస్తారు. మొదట అమెరికన్లకే ఉద్యోగం ఇవ్వాలి. అవసరమైతే తప్ప అవుట్ సోర్సింగ్ చేయకూడదు. అలా చేసినా, దాని ద్వారా దేశానికి ఆదాయం రాబట్టాలి అన్నది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం ఒక ప్రత్యేక నిధికి వెళ్తుంది. దాంతో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారు. శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్కిల్ డెవలప్మెంట్, అమెరికాలోని చిన్న కంపెనీలు ఆ దేశ పౌరులకు అధికంగా ఉద్యోగాలు ఇచ్చేలా ప్రోత్సహిస్తారు.
ఔట్‌సోర్సింగ్‌ను అరికట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన చట్టం ఇది. ఈ బిల్లు ఔట్ సోర్సింగ్‌పై ఆధారపడే భారత్ వంటి దేశాలపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. మన దేశంలోని చాలా అగ్రశ్రేణి కంపెనీల ఆదాయాలలో సగానికి పైగా ఉత్తర అమెరికా వాటా కలిగి ఉన్నాయి. మన దేశంలో ఇన్ఫోసిస్‌కు 56.5 శాతం, టీసీఎస్‌కు 48.7 శాతం దీని ద్వారానే ఆదాయం సమకూరుతున్నది. ఈ కొత్త చట్టం పర్యవసానాలు కలవరపెట్టేవిగా ఉన్నాయి. ఇప్పటికే అంతంతమాత్రం లాభాలతో ఉన్న కంపెనీలు ఈ అదనపు ట్యాక్స్ వల్ల మూతపడటం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భారత్‌లోని లక్షలాది మంది ఉద్యోగులకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.
250 బిలియన్ డాలర్ల భారత ఐటీ పరిశ్రమ ఇప్పటికే నెమ్మదిగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. 2021-22లో రెండంకెలకు చేరుకున్న వృద్ధి ఆ తర్వాత కుప్పకూలింది. ఇన్ఫోసిప్ కేవలం 1-3 శాతం మాత్రమే పెరుగుతున్నది. విప్రో, టెక్ మహీంద్రాలు ఆదాయంలో అడుగంటి పోతున్నాయి. బిలియన్ డాలర్ల కొత్త కాంట్రాక్టులు వచ్చినట్టు ప్రకటిస్తున్నప్పటికీ మార్జిన్లు క్షీణిస్తున్నాయి. ఇప్పుడు అట్లాంటిక్ అంతటా కొత్త అనిశ్చితి తలెత్తుతున్నది. యూఎస్ హైర్ బిల్లు, భారతీయ సంస్థల అతిపెద్ద మార్కెట్ అయిన యూఎస్‌తో ప్రతిభను ఆన్సైట్లో మోహరించడాన్ని కష్టతరం చేసే శాసన ప్రతిపాదన అని ఐటీ నిపుణుడొకరు పేర్కొన్నారు. బిల్లు వివరాలు ఇప్పటికే వాషింగ్టన్లో బయటకు వస్తున్నాయి. కానీ దాని దిశ స్పష్టంగా ఉంది. ఇది హెచ్1బీ వీసాలపై ఆధారపడటాన్ని పరిమితం చేస్తుందని, ఔట్సోర్సింగ్ విధానాలపై కఠిన నిబంధనలను విధిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే భారత్ ఐటీ పరిశ్రమలో మార్జిన్లు క్షీణిస్తూ ఉండగా పులిమీద పుట్రలా ఈ హైర్ బిల్లును అమెరికా తెస్తున్నదని కొటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ పేర్కొంది.
ఈ హైర్ చట్ట కంపెనీలు అవుట్సోర్సింగ్ చెల్లింపులను తగ్గించకుండా నిషేధిస్తుందని అంటున్నారు. ఇది కొత్త పన్ను చెల్లింపులను పన్ను-తగ్గింపు లేని అంశంగా చేస్తుందని ఈ చట్టం ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) విద్యార్థులపై కూడా పన్ను విధిస్తుందని ఐటీ పరిశ్రమ నిపుణులు తెలియజేస్తున్నారు. ఓపీటీపై కూడా పన్ను విధించాలని ఇప్పటికే యూఎస్ చట్టసభ సభ్యులు ప్రతిపాదించారు. ఇప్పటివరకు యూఎస్‌లో ఓపీటీ కింద పనిచేస్తున్న విదేశీ విద్యార్థులకు ఎఫ్ఐసీఏ పన్నులు చెల్లించకుండా మినహాయింపు లభించేది. ఈ కొత్త చట్టం కనుక అమలులోకి వస్తే విదేశీ విద్యార్థులు కూడా ఈ పన్ను పరిధిలోకి వచ్చి వారు కూడా ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.