కువైట్ సిటీ : భారత్ (India) , కువైట్ ( Kuwait ) దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కువైట్లో భారత రాయబారి పారమితా త్రిపాఠి ( Paramita Tripathi ) పునరుద్ఘాటించారు. కువైట్ అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు తన నియామక పత్రాలను సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో కువైట్ కు భారత్ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తోందని ఆమె తెలిపారు. కువైట్లో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీకి కువైట్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని, ఆ దేశ అమీర్ చూపుతున్న చొరవను ఆమె కొనియాడారు.
వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, రక్షణ , ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాలు సమన్వయంతో వ్యవహరిస్తూ, ప్రపంచ శాంతికి కృషి చేస్తాయని వెల్లడించారు.
భారత్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 65 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఈ సుదీర్ఘ మైత్రి ఇరు దేశాల అభివృద్ధికి బాటలు వేస్తుందని రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు.