ABC Juice | వేసవి కాలంలో జ్యూసింగ్ ఒక ట్రెండ్ మాత్రమే కాకుండా ఇప్పుడు అనేక మందికి తప్పనిసరి అలవాటుగా మారింది. ఎర్రటి రంగులో కనిపించే ABC (ఆపిల్, బీట్రూట్, క్యారెట్) జ్యూస్ అయినా, గాఢమైన ఆకుపచ్చ రంగులో ఉండే గ్రీన్ జ్యూస్ అయినా.. రెండూ జీర్ణక్రియకు మంచివని భావిస్తారు. అయితే ఈ జ్యూసులు నిజంగా గట్ మైక్రోబయోమ్ (జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా)కు ఎంతవరకు ఉపయోగపడతాయి? ప్రస్తుతం నగర జీవనశైలిలో పెరుగుతున్న జీర్ణ సమస్యలు, బ్లోటింగ్ (కడుపు ఉబ్బరం) నుంచి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) వరకు ఈ రెండు జ్యూసుల మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకోవడం అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మొదటగా ABC జ్యూస్ అంటే ఆపిల్, బీట్రూట్, క్యారెట్ కలయిక. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని ప్రచారం పొందింది. మరోవైపు గ్రీన్ జ్యూస్ అనేది పాలకూర, కేల్, దోసకాయ, సెలరీ వంటి ఆకుకూరలతో తయారవుతుంది. దీనిలో కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం కూడా కలుపుతారు.
ఒకటి భూమిలో పెరిగే వేరుజాతి పదార్థాలపై ఆధారపడితే, మరొకటి ఆకుకూరలలోని క్లోరోఫిల్, నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. ABC జ్యూస్ గట్ ఆరోగ్యానికి ప్రీ-బయోటిక్ శక్తిగా పనిచేస్తుంది. ఆపిల్‌లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. బీట్రూట్లోని బెటలైన్స్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి, తద్వారా జీర్ణ వ్యవస్థకు ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది. క్యారెట్‌లోని బీటా కెరోటిన్ విటమిన్ A గా మారి జీర్ణాశయంలోని పొరను రక్షిస్తుంది. ఈ కారణంగా ABC జ్యూస్ నెమ్మదిగా జీర్ణమయ్యే వారికి, తక్కువ ఎనర్జీ ఉన్న వారికి, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునేవారికి ఉపయోగపడుతుంది.
ఇక గ్రీన్ జ్యూస్ ప్రధానంగా శరీరాన్ని చల్లబరచే, ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గించే లక్షణాలతో ఉంటుంది. ఆకుకూరలలోని క్లోరోఫిల్ శరీరంలో టాక్సిన్స్‌ను తగ్గించి ఆల్కలైన్ బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది. పాలకూరలో ఉండే మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి పొట్ట కండరాల నొప్పులను తగ్గిస్తుంది. దోసకాయ, సెలరీ వంటి పదార్థాలు శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించి హైడ్రేషన్ పెంచుతాయి. అల్లం జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యలను తగ్గిస్తుంది. గ్రీన్ జ్యూస్ ముఖ్యంగా బ్లోటింగ్, ఆసిడిటీ సమస్యలతో బాధపడేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, జ్యూసింగ్లో ఒక ముఖ్యమైన లోపం ఫైబర్ తగ్గిపోవడం. పండ్లు, కూరగాయలను జ్యూస్ చేస్తే వాటిలోని పల్ప్ తొలగిపోతుంది. ఇదే పల్ప్ గట్ ఆరోగ్యానికి కీలకం. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి. దీని వల్ల గట్ బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఒక పండు కోసం మూడు కూరగాయల నిష్పత్తి పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఏ జ్యూస్ మంచిదనే ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. గట్ లైనింగ్‌ను బలపరచుకోవాలని అనుకుంటే ABC జ్యూస్ ఉత్తమం. ఇన్ఫ్లమేషన్, బ్లోటింగ్ తగ్గించుకోవాలంటే గ్రీన్ జ్యూస్ మంచిది. రెండింటినీ విడతలవారీగా తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఉదాహరణకు, మూడు రోజులు ABC జ్యూస్ తీసుకుని, తరువాత మూడు రోజులు గ్రీన్ జ్యూస్ తీసుకుంటే గట్ మైక్రోబయోమ్‌కు వైవిధ్యం లభిస్తుంది. అయితే ఇది సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు తప్పనిసరిగా పోషకాహార నిపుణులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.