న్యూఢిల్లీ, మార్చి 31: దేశవ్యాప్తంగా డాటా వినిమయం వాయువేగంతో దూసుకుపోతున్నది. సరాసరిగా నెలకు సగటు భారతీయుడు 31 జీబీల డాటాను వినియోగిస్తున్నారు. 2024లో 27.5 జీబీల డాటాను వినియోగిస్తుండగా..ఆ తర్వాత ఏడాది 2025లో ఇది 10 శాతం ఎగబాకి 31జీబీలకు చేరుకున్నదని టెలికాం పరికరాల తయారీ దిగ్గజం నోకియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
13వ ఎడిషన్‌గా నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్‌ను మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నెలవారీ 5జీ డాటా ట్రాఫిక్ 70 శాతం ఎగబాకి 12.9 ఎక్సాబైట్స్కి చేరుకున్నట్టు తెలిపింది. మొత్తం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లలో 47 శాతం 5జీ యూజర్లే ఉన్నారు.
2025లో సరాసరి నెలవారీ మొబైల్ డాటా వినిమయం 31జీబీలకు చేరుకున్నదని, గడిచిన ఐదేండ్లలో సరాసరిగా 18 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు వేగవంతంగా విస్తరిస్తుండటం, ఏఐ అప్లికేషన్లు, 4కే వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్‌లకు ఉన్న డిమాండ్ వల్లనే డాటా వినిమయం ఊపందుకున్నదని పేర్కొంది.