న్యూఢిల్లీ, మార్చి 31: పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల లాభాలకు గండిపడనుండగా, విమాన చార్జీలు భారీగా పెరిగాయని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) వెల్లడించింది. ప్రస్తుతం ఐఏటీఏలో ఎయిర్ ఇండియాతోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, స్పైస్‌జెట్ కలుపుకొని 350 సంస్థలు సభ్యత్వంపొందివున్నాయి.
మంగళవారం ఐఏటీఏ..ఫిబ్రవరి నెలకుగాను అంతర్జాతీయ ప్యాసింజర్ డిమాండ్ నివేదికను విడుదల చేసింది. ప్రతి కిలోమీటర్కూ ప్రయాణికుడిపై వచ్చే ఆదాయం 6.1 శాతానికి పెరిగింది. అంతక్రితం ఏడాది ఇది 5.6 శాతంగా ఉన్నది. ప్యాసింజ్ లోడ్ ఫ్యాక్టర్ 81.4 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఏఐటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ మాట్లాడుతూ.. ప్రతి కిలోమీటర్కూ ప్రయాణికుడిపై వచ్చే ఆదాయం 6.1 శాతానికి పెరిగిందని, ఫండమెంటల్స్ బలంగా ఉండటం డిమాండ్ పెరుగడానికి మరో కారణమన్నారు.
యుద్ధం రోజుల తరబడి కొనసాగితే గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ కొండెక్కే అవకాశాలున్నాయని, దీంతో టికెట్ చార్జీలను మరోసారి పెంచేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. మార్చిలో విమాన ప్రయాణికులు వృద్ధి 5 శాతంగా ఉంటుందని గతంలో అంచనావేసినప్పటికీ చివరకు 3.3 శాతానికి సరిపోయింది. ఫిబ్రవరి 2026లో కెపాసిటీ 1.9 శాతం అధికమవగా, లోడ్ ఫ్యాక్టర్ మాత్రం 89.1 శాతానికి పరిమితమైంది.