న్యూఢిల్లీ, మార్చి 31: నూతన ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ముడి చమురు ధరలు స్థిరపడిన తర్వాతే ఈక్విటీలు కోలుకునే అవకాశాలున్నాయని, లేకపోతే తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావచ్చునని అంచనాలు వెల్లడయ్యాయి. యుద్ధం దెబ్బకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 7 శాతం లేదా 5,467.37 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,187.95 పాయింట్లు లేదా 5 శాతం పతనం చెందింది. ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు నెలకొనడం, నిరంతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతుండటం, క్రూడాయిల్ ధరలు ఎగబాకుతుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం కూడా ఈక్విటీల ర్యాలీకి బ్రేక్‌లు వేసే అవకాశాలుంటాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్ 9,339.64 పాయింట్లు లేదా 11.48 శాతం కోల్పోయింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 115 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లో సూచీలకు పతనం తప్పదని హెచ్చరించిన విశ్లేషకులు..రెండో అర్థభాగంలో మాత్రం కాస్త కోలుకునే అవకాశాలు మెండుగావున్నాయన్నారు.
దలాల్‌స్ట్రీట్‌లో మదుపరులు రూ.51 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 11 శాతం లేదా 9,339.64 పాయింట్లు నష్టపోవడంతో వీరు రూ.51 లక్షల కోట్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.51,09,498.82 కోట్లు కరిగిపోయి రూ.4,12,41,172.45 కోట్ల(4.36 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది.