ముంబై, అక్టోబర్ 5 : దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. చమురు సరఫరా ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి. అమెరికా ఉద్యోగుల డాటా అంచనాల కంటే తక్కువగా నమోదుకావడంతో వచ్చే సమీక్షలో అమెరికా ఫెడరల్ తన కఠిన నిబంధనలను సడలించే అవకాశం ఉన్నట్టు వచ్చిన అంచనాలు గ్లోబల్ మార్కెట్లలో జోష్ పెంచింది.
దీంతో దేశీయ సూచీలు కదంతొక్కాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్..చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 472.77 పాయింట్లు అందుకొని తిరిగి 72 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. చివరకు 72,382.47 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 133.80 పాయింట్టు అందుకొని 22,555.75 పాయింట్ల వద్ద ముగిసింది.