స్విస్ ఓపెన్
బసెల్: స్విస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు హెచ్ఎస్ ప్రణయ్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండో సీడ్ సింధు 21-10, 21-19తో ఐదో సీడ్ మిచెల్లి లీ (కెనడా)ను చిత్తుగా ఓడించి ముందంజ వేసింది. దూకుడైన ఆటతో 36 నిమిషాల్లోనే రెండు సెట్లలోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన ఈ తెలుగమ్మాయి సెమీస్‌లో సుపనిద (థాయిలాండ్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ పోరులో ప్రణయ్ 21-16, 21-16తో భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. సింగిల్స్‌లో సమీర్ వర్మ, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీలు నిరాశపర్చాయి. మూడో సీడ్ ఆంటోనీ సినిసుక గింటింగ్ (ఇండోనేషియా)తో ప్రణయ్ ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ 20-22, 21-23తో వివియాన్ హు-లిమ్ చూసియెన్ (మలేషియా) జంట చేతిలో పోరాడి ఓడారు.