న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ రైల్వే మరో కీలక బాధ్యతను తలకెత్తుకున్నది. కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా చేసిన రైల్వేశాఖ.. ఈ సారి విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెకించేందుకు బొగ్గు సరఫరా చేసే బాధ్యతను స్వీకరించింది. బోర్డు సూచనల మేరకు వేగంగా విద్యుత్ థర్మల్ ప్లాంట్లకు బొగ్గును రవాణా ప్రారంభించింది. ఈ విషయంలో రైల్వేలోని అధికారులంతా చురుగ్గా ఉండాలని, గంట గంటకు సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది. విద్యుత్, కోల్ మినిస్ట్రీ మంత్రిత్వశాఖలతో జరిగిన చర్చల్లో రైల్వే రవాణా సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పవర్ హౌస్ల అవసరాలకు అనుగుణంగా బొగ్గును తరలించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం బొగ్గు కొరతను అంతర్గత అత్యయిక పరిస్థితిగా రైల్వే పరిగణిస్తోంది. దీంతో విద్యుత్ ప్లాంట్లకు తరలించేందుకు 24 గంటలు వ్యాగ్లను నింపుతున్నారు. బొగ్గు కొరతను అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన రైల్వే.. అన్ని జోనల్ రైల్వేల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్లకు కంట్రోల్ రూమ్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. దీంతో పాటు జీఎం, మంత్రిత్వశాఖ అధికారుల కోసం గంటకో బులిటెన్ సిద్ధం చేయాలని కోరింది. బొగ్గు సరఫరాకు సంబంధించి రైల్వే నుంచి వ్యాగన్లు, రేకుల కొరత లేదని మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. సంక్షోభ సమయంలో బొగ్గు రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నాయి.
రైల్వేలో 850 రేకులు ఉండగా.. బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి మరిన్ని రేకులకు డిమాండ్ ఉండగా.. ఈ మేరకు ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రైల్వే 435 రేకులతో రోజుకు 4000 టన్నుల బొగ్గును రవాణా చేస్తోంది. గూడ్స్ రైళ్ల సగటు వేగం రెండు సంవత్సరాల క్రితం గంటకు 24 కిలోమీటర్ల నుంచి 46 కి.మీ.కి పెరిగింది. ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రతిరోజూ లోడ్ చేయాల్సిన బొగ్గు రేకుల సంఖ్యను 430 నుంచి 440-450 వరకు పెంచింది. సోమవారం 1.77 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసింది. రోజుకు 500 రేక్లకు డిమాండ్ పెరిగినప్పటికీ, దాన్ని సౌకర్యవంతంగా నిర్వహించడానికి రైల్వే సిద్ధంగా ఉందని మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని తూర్పు భాగంలోని బొగ్గు గనుల డిమాండ్ ఉండగా.. ఆయా ప్రాంతాలకు తూర్పు మధ్య రైల్వే సేవలు అందిస్తున్నది.