కువైట్ సిటీ,జూన్ 04 : కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ పౌరుడి భౌతిక కాయాన్ని భారత రాయబారి పారమితా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ మేనేజర్ బ్రిగేడియర్ అబ్దుల్‌రహీం అల్-అవధితో సమావేశమయ్యారు. ఈ ఉదంతంలో కువైట్ అధికారులు స్పందించిన తీరును, అందిస్తున్న తక్షణ సహాయ సహకారాలను ఆమె అభినందించారు. మృతి చెందిన భారతీయ పౌరుడి కుటుంబ సభ్యులతో భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించేందుకు కువైట్ అధికారులతో కలిసి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, ఈ దాడిలో గాయపడి కువైట్‌లోని వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న భారతీయులను కూడా రాయబారి పారమితా త్రిపాఠి పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు రాయబార కార్యాలయం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందేలా ఆసుపత్రి వర్గాలతో నిరంతరం మాట్లాడుతుంటామని ఆమె భరోసా ఇచ్చారు.