e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News గెలుపు వాకిట్లో!

గెలుపు వాకిట్లో!

  • విజయానికి 9 వికెట్ల దూరంలో భారత్‌
  • లక్ష్యం 284, కివీస్‌ ప్రస్తుతం 4/1 అయ్యర్‌, సాహా అర్ధసెంచరీలు
  • భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 234/7 డిక్లేర్డ్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న కాన్పూర్‌ టెస్టుపై భారత్‌ మరింత పట్టు బిగిస్తున్నది. సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ గెలుపు వాకిట్లో నిలిచింది. సుడులు తిరుగుతున్న పిచ్‌పై టీమ్‌ఇండియా స్పిన్‌ త్రయం అక్షర్‌, అశ్విన్‌, జడేజా విజృంభిస్తే భారీ విజయం మన ఖాతాలో చేరినట్లే. 284 పరుగుల లక్ష్యఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్‌..వికెట్‌ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది. తొలుత శ్రేయాస్‌ అయ్యర్‌, సాహా అర్ధసెంచరీలతో భారత్‌ పోరాడే స్కోరు అందుకుంది. 50 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరు గాడిలో పడేశారు.

కాన్పూర్‌: న్యూజిలాండ్‌ ముందు భారత్‌ నిర్దేశించిన లక్ష్యం 284. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కివీస్‌..ఓపెనర్‌ విల్‌ యంగ్‌(2) వికెట్‌ కోల్పోయి 4 పరుగులు చేసింది. చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్న కివీస్‌ 280 పరుగుల వెనుకంజలో ఉంది. ఓవైపు భారత స్పిన్నర్లకు, మరోవైపు కివీస్‌ పేసర్లకు అనుకూలిస్తున్న కాన్పూర్‌ పిచ్‌పై ఆఖరి రోజు ఆధిపత్యం ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. భారత స్పిన్‌ త్రయం అశ్విన్‌, జడేజా, అక్షర్‌ స్పిన్‌ ధాటిని ఎదుర్కొంటూ ఐదో రోజు మొత్తం వికెట్లు కాపాడుకోవాలంటే కివీస్‌కు తలకు మించిన భారమే కావచ్చు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప..టీమ్‌ఇండియా విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యమే. ఎందుకంటే 1987లో భారత్‌పై 276 పరుగుల లక్ష్యాన్ని వీవ్‌ రిచర్డ్స్‌ కెప్టెన్సీలోని వెస్టిండీస్‌ ఛేదించడమే ఇప్పటి వరకు రికార్డు. మ్యాచ్‌ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న విల్‌ యంగ్‌ను అశ్విన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లిన అతనికి సానుకూల ఫలితం దక్కలేదు. కండ్ల ముందు భారీ లక్ష్యమున్న కివీస్‌ తరఫున ప్రస్తుతం లాథమ్‌(2), సోమర్‌విల్లే(0) క్రీజులో ఉన్నారు.

- Advertisement -

అయ్యర్‌, సాహా అదుర్స్‌
ఓవర్‌నైట్‌స్కోరు(14/1)తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. వైస్‌ కెప్టెన్‌ పుజార(22) మరోమారు నిరాశపరిచాడు. జెమీసన్‌ బౌలింగ్‌లో కీపర్‌ బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్‌ రహానే(4) పుజారను అనుసరించాడు. ఆజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయి భారంగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మయాంక్‌(17), జడేజా(0) వెంటవెంటనే ఔట్‌ కావడంతో భారత్‌ 51 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో శ్రేయాస్‌ అయ్యర్‌(125 బంతుల్లో 65, 8 ఫోర్లు, సిక్స్‌), సాహా(126 బంతుల్లో 61 నాటౌట్‌, 4 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరు కివీస్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు.

ముఖ్యంగా అరంగేట్ర టెస్టు ఆడుతున్న అయ్యర్‌..సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఓ భారీ సిక్స్‌ కొట్టిన అయ్యర్‌ అర్ధసెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. మరో ఎండ్‌లో సాహా కూడా బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. సౌథీ బౌలింగ్‌లో అయ్యర్‌ ఔట్‌ కావడంతో ఏడో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. అయితే ఆఖర్లో అక్షర్‌ పటేల్‌(28 నాటౌట్‌)తో కలిసి సాహా చెలరేగాడు. దీంతో ఎనిమిదో వికెట్‌కు 67 పరుగులు జతకలిశాయి.. 234 పరుగుల వద్ద టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సౌథీ, జెమీసన్‌ మూడేసి వికెట్లు పడగొట్టారు.

అరంగేట్ర టెస్టులో సెంచరీతో పాటు
1-
అర్ధసెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా తొలి టెస్టులో అత్యధిక పరుగులు చేసిన వారిలో ధవన్‌(187), రోహిత్‌శర్మ(177) తర్వాత అయ్యర్‌(170) మూడో స్థానంలో నిలిచాడు.

3- టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్భజన్‌సింగ్‌(417)తో కలిసి అశ్విన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. కుంబ్లే(619), కపిల్‌దేవ్‌(434) ముందు వరుసలో ఉన్నారు.

స్కోరుబోర్డు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345 ఆలౌట్‌; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 296 ఆలౌట్‌; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌(సి)లాథమ్‌(బి)సౌథీ 17, గిల్‌(బి)జెమీసన్‌ 1, పుజార(సి)బ్లండెల్‌(బి)జెమీసన్‌ 22, రహానే(ఎల్బీ)ఆజాజ్‌ పటేల్‌ 4, అయ్యర్‌(సి)బ్లండెల్‌(బి)సౌథీ 65, జడేజా(ఎల్బీ) సౌథీ 0, అశ్విన్‌ (బి)జెమీసన్‌ 32, సాహా 61 నాటౌట్‌, అక్షర్‌ పటేల్‌ 28 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 81 ఓవర్లలో 234/7 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-2, 2-32, 3-41, 4-51, 5-51, 6-103, 7-167; బౌలింగ్‌: సౌథీ 22-2-75-3, జెమీసన్‌ 17-6-40-3, ఆజాజ్‌ పటేల్‌ 17-3-60-1, రవీంద్ర 9-3-17-0, సోమర్‌విల్లే 16-2-38-0.

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ 2 నాటౌట్‌, యంగ్‌(ఎల్బీ) అశ్విన్‌ 2, సోమర్‌విల్లే 0 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 4 ఓవర్లలో 4/1; వికెట్ల పతనం: 1-3; బౌలింగ్‌: అశ్విన్‌ 2-0-3-1, అక్షర్‌ పటేల్‌ 2-1-1-0.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement