Amit Shah | న్యూఢిల్లీ, నవంబర్ 2: కెనడాలో ఖలిస్థానీ అనుకూలురపై దాడులకు భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారంటూ కెనడా మంత్రి చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం శనివారం తీవ్రంగా మండిపడింది. ఆ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ఆధార రహితమైనవని తెలిపింది. కెనడాలో నివసిస్తున్న సిక్కు వేర్పాటువాదులు లక్ష్యంగా హింస, బెదిరింపులు, గూఢచర్యానికి పాల్పడాలంటూ అమిత్ షా ఆదేశాలు ఇచ్చారని కెనడా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డేవిడ్ మారిసన్ మంగళవారం ఆరోపించారు. కెనడా మంత్రి బాధ్యతా రాహిత్య వైఖరి కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు కెనడా హై కమిషన్ ప్రతినిధిని శుక్రవారం పిలిపించి మన నిరసన తెలియజేసినట్టు చెప్పారు.
తమ దేశానికి భారత్‌తో సైబర్ ముప్పు పొంచి ఉన్నదని పేర్కొన్న కెనడాకు భారత్ శనివారం గట్టిగా బదులిచ్చింది. కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇటీవల వెలువరించిన నివేదికలో భారత్‌ను ‘దేశ విరోధి’ విభాగంలో చేర్చడంతో పాటు భారత్ నుంచి సైబర్ ముప్పు పొంచి ఉన్నదని పేర్కొన్నది. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. భారత్‌పై దాడికి కెనడా అమలు చేస్తున్న వ్యూహాలకు ఇది ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఇలా అసంబద్ధ, నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.