e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం

ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం

  • రోహిత్‌ ఫటాఫట్‌
  • అర్ధసెంచరీతో విజృంభణ
  • ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలైన పోరుకు ముందు భారత్‌కు అదిరిపోయే సన్నాహాందక్కింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇరుగదీసిన టీమ్‌ఇండియా..ఆస్ట్రేలియాతో వామప్‌ మ్యాచ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కంగారూలను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన భారత్‌..బ్యాటింగ్‌లో సత్తాచాటింది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ ధనాధన్‌ అర్ధసెంచరీకి తోడు రాహుల్‌, సూర్యకుమార్‌ సమయోచిత ఆటతో అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రోహిత్‌ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మొత్తంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా మంచి ప్రాక్టీస్‌ లభించింది. మిగిలిందల్లా ఆరో బౌలర్‌ కోటా ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది.

దుబాయ్‌: పొట్టి ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ సర్వశక్తులతో సిద్ధమైంది. దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు వామప్‌ మ్యాచ్‌లను టీమ్‌ఇండియా చక్కగా సద్వినియోగం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పనిపట్టిన భారత్‌..ఆస్ట్రేలియాను హడలెత్తించింది. పాక్‌తో తొలి పోరుకు తుది కూర్పుపై నిర్ణయానికి వచ్చేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌..ఆసీస్‌తో మ్యాచ్‌లో పలు మార్పులు చేసింది. బుధవారం జరిగిన రెండో వామప్‌ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ సారథ్యంలోని భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా మరో 13 బంతులు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ఓపెనర్‌ రోహిత్‌శర్మ(41 బంతుల్లో 60, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. రాహుల్‌(39), సూర్యకుమార్‌ యాదవ్‌(38 నాటౌట్‌) రాణించారు. తొలుత స్టీవ్‌స్మిత్‌(57), స్టోయినిస్‌(41 నాటౌట్‌) ఆకట్టుకోవడంతో ఆసీస్‌ 20 ఓవర్లలో 152/5 స్కోరు చేసింది. అశ్విన్‌(2/8) రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్‌, జడేజా, రాహుల్‌ చాహర్‌ ఒక్కో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.

రోహిత్‌ ధనాధన్‌:

- Advertisement -

రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గైర్హాజరీలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ జట్టును ముందుండి నడిపించాడు. రాహుల్‌ జతగా బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌..ఆసీస్‌ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఆది నుంచే బ్యాటు ఝులిపించాడు. తన ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ బౌండరీలతో కంగారెత్తించాడు. మరో ఎండ్‌లో రాహుల్‌ వీరవిహారం చేయడంతో ఆసీస్‌ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. పసలేని కంగారూల బౌలింగ్‌ను వీరిద్దరు చీల్చిచెండాడారు. ముఖ్యంగా మెగాటోర్నీల్లో ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా నిలిచే హిట్‌మ్యాన్‌ తన ఇన్నింగ్స్‌లో మూడు భారీ సిక్స్‌లు, ఐదు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఆస్టన్‌ ఆగర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన రాహుల్‌..వార్నర్‌ క్యాచ్‌ ద్వారా తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 68 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20ల్లో తన భిన్నమైన శైలిని మరోమారు చాటుకున్నాడు. రోహిత్‌ జతగా వైవిధ్యమైన షాట్లతో స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించాడు. అయితే సహచరుల మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం అర్ధసెంచరీ తర్వాత రోహిత్‌శర్మ పెవిలియన్‌ చేరగా, అతని స్థానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఓవైపు అప్పటికే క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్‌కు జత కలిసిన హార్దిక్‌ భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో మ్యాచ్‌కు ముగింపు పలికి ఫినిషర్‌గా తనకు అప్పజెప్పిన పాత్రకు న్యాయం చేశాడు. వామప్‌ మ్యాచ్‌ను తేలికగా తీసుకున్న ఆసీస్‌ బౌలర్లు ఘోరంగా తేలిపోయారు.

ఆదుకున్న స్మిత్‌, స్టోయినిస్‌:

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు సరైన ఆరంభం దక్కలేదు. టాపార్డర్‌ త్రయం వార్నర్‌(1), ఫించ్‌(8), మిచెల్‌ మార్ష్‌(0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తన పేలవ ఫామ్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్న వార్నర్‌ను..అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. రివర్స్‌ స్వీప్‌ చేయడానికి ప్రయత్నం చేసిన వార్నర్‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. వార్నర్‌ను అనుసరిస్తూ కెప్టెన్‌ ఫించ్‌..జడేజా తొలి బంతికే పెవిలియన్‌ బాట పట్టాడు. జట్టులోకి వస్తూ పోతున్న ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌..అశ్విన్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా నిష్క్రమించాడు. దీంతో 11 పరుగులకే ఆసీస్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు కలిసి సమయోచిత ఆటతీరుతో స్కోరుబోర్డుకు పరుగులు జోడించారు. చాహర్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ క్లీన్‌బౌల్డ్‌తో నాలుగో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖర్లో స్టోయినిస్‌ ధాటిగా ఆడటంతో ఆసీస్‌కు పోరాడే స్కోరు దక్కింది. ఇంగ్లండ్‌తో వామప్‌ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చుకున్న భువనేశ్వర్‌ కుమార్‌ ఈ మ్యాచ్‌లో ఆకట్టుకోగా, కెప్టెన్‌ కోహ్లీ బౌలర్‌ అవతారమెత్తాడు. ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటాడనుకున్న విరాట్‌ రెండు ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చాడు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి పొదుపు పాటించినా..వికెట్‌ ఖాతాలో వేసుకోలేకపోయాడు. మొత్తంగా బౌలింగ్‌ పరంగా బలంగా ఉన్నా..ఆరో బౌలర్‌ కోటా ఎవరిదన్న దానిపై సందిగ్ధత కొనసాగుతున్నది.

హార్దిక్‌ బౌలింగ్‌కు సిద్ధంగా ఉండాలి

దుబాయ్‌: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉండాలని భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ జరిగే సమయానికి హార్దిక్‌ బౌలింగ్‌ వేసేందుకు తయారుగా ఉండాలని సూచించాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన వామప్‌ మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు హార్దిక్‌ బౌలింగ్‌ వేయలేదు. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ప్రారంభమయ్యే లోగా పాండ్యా బౌలింగ్‌తో సిద్ధంగా ఉండాలి. మాకు బౌలర్ల బృందం బలంగానే ఉంది. కానీ ఆరో బౌలర్‌ అవసరం ఉంది. ఐదుగురు బౌలర్లతో ఆడినా సమస్య ఏమి లేదు. ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీల్లో ఆడేప్పుడు బౌలర్లు ఎక్కువ ఉంటే బాగుంటుంది. అనుకోకుండా ఎవరికైనా ఏదైనా జరిగితే ఆప్షన్స్‌గా ఉన్నవారు బౌలింగ్‌ చేసే అవకాశం ఉంటుంది’ అని అన్నాడు.

రోహిత్‌ శర్మ

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 152/5 (స్మిత్‌ 57, స్టోయినిస్‌ 41, అశ్విన్‌ 2/8, చాహర్‌ 1/17), భారత్‌: 17.5 ఓవర్లలో 153/2 (రోహిత్‌శర్మ 60, రాహుల్‌ 39, ఆగర్‌ 1/14).

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement