Samudrayaan : ‘సముద్రయాన్’ ప్రయోగానికి ఇండియా సిద్ధమవుతోంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య-6000’ అనే సబ్ మెరైన్ ను ఇండియా వచ్చే మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనుంది. ‘మత్స్య-6000’.. ఇండియా డెవలప్ చేస్తున్న నాలుగోతరం సబ్ మెరైన్. డీప్ ఓషన్ మిషన్ (డీఓఎం) కింద 2021లో రూ.4,077 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.
చెన్నైలోని ఎన్ఐఓటీ (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ) సెంటర్లో ఇది ఇప్పుడు పూర్తి కావస్తోంది. 25 టన్నుల బరువు గల ఈ ‘మత్స్య-6000’ సముద్రంలో 500 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఈ లోతులో ఉండే పీడనాన్ని ఇది తట్టుకునేలా దీన్ని రూపొందిస్తున్నారు. నావిగేషన్ సెన్సర్స్, లైఫ్ సపోర్ట్ వంటి ఫీచర్లున్నాయి. దీని ద్వారా 500 మీటర్ల సముద్ర గర్భంలోని రహస్యాల్ని పరిశోధిస్తారు. సాగర్ నిధి అనే నౌకను దీనికి తోడుగా పంపిస్తారు. ‘మత్స్య-6000’ సముద్రంలోపలికి వెళ్లి, అక్కడి జీవుల్ని, జీవ వైవిధ్యాన్ని, ఖనిజాల్ని పరిశీలించి, నమూనాల్ని సేకరిస్తుంది. అలాగే జియో మ్యాపింగ్ చేస్తుంది. ఇది ముగ్గురు ఆక్వానాట్స్ (సముద్ర గర్భ పరిశోధకులు)ను 12 గంటలపాటు మోసుకెళ్లగలదు. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటలు పని చేస్తుంది.
ఇండియా.. మొత్తం 6,000 మీటర్ల సముద్ర లోతులో పరిశోధనలు జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా మొదట 500 మీటర్ల లోతులో పరిశోధనలు జరిపే ‘మత్స్య-6000’ పంపిస్తారు. నెమ్మదిగా మెరుగైన వాటిని తయారు చేస్తారు. ఇది సక్సెస్ అయితే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన ఇండియా చేరుతుంది. ఇప్పటికే ఇండియా.. ఫ్రాన్స్ సహకారంతో నౌటిలె అనే సబ్ మెరైన్ ను ప్రవేశపెట్టింది. ఇది 5,002 మీటర్ల లోతులో పరిశోధించగలదు.