Supreme Court : కేంద్ర మాజీ మంత్రి (Ex Minister) మేనకా గాంధీ (Maneka Gandhi) పై భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. వీధి శునకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మేనకా చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించింది. ఆమె కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
వీధి శునకాల అంశంపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన సుప్రీం ధర్మాసనం.. మేనకాగాంధీ ఎలాంటి ఆలోచన లేకుండా అందరిపై అన్ని రకాల వ్యాఖ్యలు చేశారని మండిపడింది. మీ క్లయింట్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మీరు అడిగారా..? అని ఆమె తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
‘కోర్టు ఆచితూచి వ్యవహరించాలని మీరు చెబుతున్నారు. కానీ మీ క్లయింటు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అడిగారా..? ఆమె పాడ్‌క్యాస్ట్‌ను విన్నారా..? ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరిపై అన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆమె తీరు గమనించారా..?’ అని మేనకాగాంధీ తరఫున సీనియర్ అడ్వేకేట్ రాజు రామచంద్రన్‌ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
మేనకాగాంధీ మాటలు కోర్టు ధిక్కారమే అయినప్పటికీ న్యాయస్థానం ఔన్నత్యం దృష్ట్యా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పింది. వీధి శునకాల సమస్యను కట్టడి చేసేందుకు.. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఎంత బడ్జెట్ కేటాయించారని ఈ సందర్భంగా పిటిషనర్‌ను జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు.
శునకాలకు ఆహారం పెట్టేవారిని జవాబుదారీ చేయాలని న్యాయస్థానం తేలిగ్గా వ్యాఖ్యానించలేదని, సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకునే అలా చెప్పామని అన్నారు.