గట్టుప్పల్, ఆగస్టు 24 : అసంపూర్తిగా ఉన్న పాఠశాల నిర్మాణ పనులను పూర్తి చేసి, విద్యార్థుల అవస్థలను తీర్చాలని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక చౌరస్తా నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా ప్రజావాణిలో అధికారులకు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుకోవడానికి సరైన గదులు లేకపోవడంతో చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మనబడి పథకం ద్వారా నూతన గదుల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఊరు-మనబడి పథకంను రద్దుచేసి పనులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
విద్యార్థులు చెట్ల కింద చదువుకుని అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చదువుకోవడానికి సరైన వసతి లేకపోవడం వాటిని కల్పించకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. పాఠశాల పరిస్థితులు తెలిసి కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర నోరు మెదపకపోవడం శోచనీయం అన్నారు. ఎమ్మెల్యే దగ్గర సమస్యలను చెప్పలేని నాయకులు ఎందుకని ప్రశ్నించారు. స్థానిక అధికారులు జిల్లా అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు సమస్యను వివరించి అసంపూర్తిగా ఉన్న పాఠశాల నిర్మాణంను పూర్తి చేయించాలని కోరారు. ఈ 6 నెలల సమయంలో పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, లేదంటే ఇంటింటికి తిరిగి జోల పట్టుకుని చందాలు సేకరించి పాఠశాల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు.
నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్‌కు పునాదులని అన్నారు. నియోజకవర్గంకు ఎమ్మెల్యే, ఎంపీ ఇతర నిధులు కూడా ఉంటాయి కాబట్టి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, నాయకుడు చిలుకూరి అంజయ్య, వార్డు సభ్యులు పున్న కిశోర్, నారని జగన్, పున్న ఆనంద్, జూలూరు పురుషోత్తం, కర్నాటి వెంకటేశం, పిశికె రాంబాబు, నాయకులు గొరిగె సత్తయ్య, తిరందాసు ఆనంద్, పోరెడ్డి ముత్తారెడ్డి, కర్నాటి అబ్బయ్య, పగిళ్ల హనుమంతు, ఈశ్వరప్ప, చెరిపల్లి నగేశ్, నేలంటి వెంకటేశం, పెదగాని శ్రీనివాస్, ఖమ్మం రాజశేఖర్, గోరిగె శంకర్ పాల్గొన్నారు.

‘పాఠశాల నిర్మాణ పనులను పూర్తి చేయాలని ధర్నా’