Diabetes | భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు కొంత పెరగడం సహజమే. అయితే అది ఎంత మేర పెరిగింది, ఎంతసేపు ఎక్కువగా ఉంది, ఎంత తరచూ జరుగుతోంది, ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థాయికి వస్తుందా అనే విషయాలను పరిశీలించడం ముఖ్యం. ఒక్కసారి బ్లడ్ షుగర్ పెరిగినంత మాత్రాన డయాబెటిస్ ఉందని నిర్ధారించలేం. ఆహారం, శారీరక శ్రమ, నిద్ర, ఒత్తిడి వంటి అనేక అంశాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయి. మనం కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ వాటిని గ్లూకోజ్‌గా విడగొడుతుంది. ఈ గ్లూకోజ్ రక్తంలోకి చేరడంతో బ్లడ్ షుగర్ పెరుగుతుంది. దీనికి ప్రతిస్పందనగా క్లోమం ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్‌ను కండరాలు, ఇతర కణజాలాల్లోకి చేరేలా చేస్తుంది. సాధారణంగా డయాబెటిస్ లేని వారిలో ఈ ప్రక్రియ కొంత సమయం తర్వాత రక్తంలో చక్కెరను సాధారణ స్థాయికి తీసుకువస్తుంది.
అయితే ప్రతి ఆహారం రక్తంలో చక్కెరను ఒకే విధంగా పెంచదు. తెల్ల బియ్యం, ఆలుగడ్డలు, చక్కెర కలిగిన పానీయాలు, స్వీట్లు వంటి ఆహారాలు గ్లూకోజ్‌ను వేగంగా పెంచుతాయి. మరోవైపు కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక ఫైబర్ ఉన్న కార్బొహైడ్రేట్లతో కూడిన ఆహారం రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల వేగాన్ని తగ్గిస్తుంది. తీసుకునే ఆహారం పరిమాణం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో కూడా బ్లడ్ షుగర్ తాత్కాలికంగా పెరుగుతుంది. ఒత్తిడికి ప్రతిస్పందనగా శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కాలేయంలో నిల్వ ఉన్న గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేయమని సంకేతాలు ఇస్తాయి. ఫలితంగా గతంలో బ్లడ్ షుగర్ సమస్యలు లేని వ్యక్తుల్లో కూడా కొంతకాలం గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్యం, జ్వరం లేదా శారీరక గాయం సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో ఒత్తిడి హార్మోన్లు పెరగడంతోపాటు కొంతకాలం ఇన్సులిన్ ప్రభావం తగ్గుతుంది. అలాగే నిద్ర సరిగా లేకపోవడం కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఆకలి నియంత్రణపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తక్కువ గంటలు నిద్రపోయే రోజుల్లో బ్లడ్ షుగర్ ఎక్కువగా కనిపిస్తే, ఈ రెండింటి మధ్య సంబంధం ఉంటుంది.
వ్యాయామం కూడా బ్లడ్ షుగర్‌పై వివిధ రకాల ప్రభావాలు చూపుతుంది. సాధారణంగా ఏరోబిక్ వ్యాయామం కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకునేలా చేసి బ్లడ్ షుగర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే తీవ్రమైన వ్యాయామం, ముఖ్యంగా అధిక శ్రమతో కూడిన అనెరోబిక్ వ్యాయామం సమయంలో అడ్రినలిన్ వంటి హార్మోన్ల ప్రభావంతో కాలేయం ఎక్కువ గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేస్తుంది. దీంతో కొద్దిసేపు బ్లడ్ షుగర్ పెరిగినట్లు కనిపిస్తుంది. దీనర్థం వ్యాయామం మానేయాలని కాదు. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం దీర్ఘకాలంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి శరీరం గ్లూకోజ్‌ను సమర్థంగా వినియోగించుకునేలా చేస్తుంది. కొన్ని మందులు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ప్రెడ్నిసోలోన్ వంటి కార్టికోస్టెరాయిడ్లు బ్లడ్ షుగర్‌ను పెంచే అవకాశం ఉంది. కొన్ని హార్మోనల్ మందులు, ఇతర ఔషధాలు కూడా గ్లూకోజ్ నియంత్రణపై ప్రభావం చూపిస్తాయి. కొత్త మందు ప్రారంభించిన తర్వాత బ్లడ్ షుగర్ పదేపదే పెరుగుతున్నట్లు గమనిస్తే, వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడి సలహా లేకుండా మందులను స్వయంగా ఆపకూడదు. మనం ఏం తింటున్నామన్నదే కాకుండా ఎలా తింటున్నామన్నది కూడా ముఖ్యం. ఉదాహరణకు చక్కెర కలిపిన టీ, తెల్ల బ్రెడ్, జామ్‌తో కూడిన అల్పాహారంలో వేగంగా శోషణకు గురయ్యే కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండి ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల గ్లూకోజ్ వేగంగా పెరుగుతుంది. దీనికి బదులుగా గుడ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలతో కూడిన అల్పాహారం తీసుకోవడం వల్ల గ్లూకోజ్ రక్తంలోకి చేరే వేగాన్ని తగ్గించవచ్చు.
కార్బొహైడ్రేట్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వాటి పరిమాణంపై శ్రద్ధ పెట్టడం, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం, కార్బొహైడ్రేట్లను ప్రోటీన్‌తో కలిపి తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ వేగంగా పెరగడాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఒక్కసారి వచ్చిన అధిక బ్లడ్ షుగర్ రీడింగ్‌ను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉపయోగించే గ్లూకోజ్ మీటర్లకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. పరీక్షను ఎప్పుడు చేశారన్నది కూడా ఫలితాన్ని అర్థం చేసుకోవడంలో కీలకం. అయితే బ్లడ్ షుగర్ పదేపదే ఎక్కువగా వస్తుంటే మాత్రం దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, కారణం లేకుండా బరువు తగ్గడం, అసాధారణమైన అలసట లేదా చూపు మసకబారడం వంటి లక్షణాలు కూడా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. అవసరాన్ని బట్టి వైద్యులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలను సూచిస్తారు. ముఖ్యంగా హెచ్‌బీఏ1సీ పరీక్ష గత రెండు నుంచి మూడు నెలల కాలంలో సగటు రక్తంలో చక్కెర స్థాయిపై అంచనాను ఇస్తుంది. అందువల్ల భోజనం తర్వాత ఒక్కసారి వచ్చిన రీడింగ్‌పై ఆధారపడటం కంటే ఈ పరీక్షలు శరీరంలోని గ్లూకోజ్ నియంత్రణపై మెరుగైన సమాచారాన్ని అందిస్తాయి.
డయాబెటిస్‌కు ముందు దశగా పరిగణించే ప్రీడయాబెటిస్‌లో కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పదేపదే పెరుగుతాయి. ఈ దశలో స్పష్టమైన లక్షణాలు ఉండవు. పొట్ట చుట్టూ అధిక కొవ్వు, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిల్లో మార్పులు లేదా గర్భధారణ సమయంలో డయాబెటిస్ వచ్చిన చరిత్ర వంటి ప్రమాద కారకాలు ఉన్నవారు పరీక్షలపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. అందువల్ల బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడం అంటే ఒక కొలత మాత్రమే, డయాబెటిస్ నిర్ధారణ కాదు. అధిక కార్బొహైడ్రేట్లతో కూడిన భోజనం, తీవ్రమైన వ్యాయామం లేదా ఒత్తిడితో కూడిన రోజులో తాత్కాలికంగా బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే రీడింగ్స్ పదేపదే ఎక్కువగా వస్తుంటే లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. బ్లడ్ షుగర్‌ను మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి పరీక్ష చేసిన సమయం, ఆ సమయంలో తీసుకున్న ఆహారం, చేసిన శారీరక శ్రమ, అనారోగ్యం లేదా ఒత్తిడి వంటి వివరాలను నమోదు చేసుకోవాలి. ఒక్క సంఖ్య కంటే కొన్ని రోజుల నుంచి వారాల వరకు కనిపించే విధానం, అంటే బ్లడ్ షుగర్‌లోని మార్పుల నమూనా, ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడంలో మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.