యజ్ఞయాగాలు, వేదపారాయణాలతో యాదాద్రి ఘోషించగా.. ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడింది. పంచ నారసింహుని క్షేత్రం
పునరావిష్కరణలో భాగంగా చేపడుతున్న మహాకుంభ సంప్రోక్షణ పర్వానికి సోమవారం దేదీప్యమానంగా అంకురార్పణ జరిగింది. వాస్తుహోమం, పర్వగ్నకరణం, రుత్విగ్వరణం, మృత్యంగ్రహణ పూజలతో అటు ప్రధానాలయం, ఇటు బాలాలయంలో భక్తి పరిమళాలు వెదజల్లాయి. ఉత్సవాల్లో తొలిరోజు.. సోమవారం వేకువజామున బాలాలయంలో నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయంలో స్వామివారి ఆజ్ఞ తీసుకుని బాలాలయంలో స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, రక్షా బంధనం,
పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, రుత్విగ్వరణం, అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. వాస్తు పూజ, వాస్తు బలి, వాస్తు హోమం, పర్వగ్నకరణం కార్యక్రమాలు ప్రధానాలయంలో పాంచరాత్రాగమ శాస్ర్తానుసారంగా ఆధ్వర్యంలో జరిగాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ పర్వాలను సోమవారం చేపట్టారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతినక్షత్రం సందర్భంగా ఉదయం 4 గంటలకు బ్రహ్మీ ముహూర్తంలో 108 కలశాలతో ఘటాభిషేకం నిర్వహించారు. స్వస్తివాచనం, విశ్వక్సేనుడి పూజాపర్వాలు, పుణాహవాచనం నిర్వహించి రక్షాబంధనం చేపట్టారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, కుంభ స్థాపన కార్యక్రమాలు జరిపించారు. సీఎం కేసీఆర్ స్వామివారికి ప్రధాన సేవకుడిగా ఉండి దివ్వ సన్నిధానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని గోత్ర నామాల సంకల్పం చెప్పారు. స్వామివారి అనుమతిని తీసుకొని తిరిగి బాలాలయంలోకి చేరుకుని స్వస్తివాచన పర్వాలను కొనసాగించారు.
మల్లన్న సాగర్ నుంచి రెండు రోజుల కింద విడుదలైన గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ యాదాద్రి క్షేత్రాన ఉన్న గండి చెరువులోకి వచ్చి చేరాయి. ఒక్క రోజు ముందుగా జంగంపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు చేరుకున్న సందర్భంలోనూ.. గండి చెరువులోకి తరలివచ్చిన సందర్భంలోనూ కళ్లముందు జలదృశ్యం సాక్షాత్కారమైంది. సోమవారం ఉదయం 7 గంటల సుముహుర్తాన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పూజలు నిర్వహించి గండి చెరువుకు వెళ్లే కాల్వ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. క్కడి నుంచి పది కిలోమీటర్లు ప్రయాణించి గండి చెరువులోకి జలాలు మధ్యాహ్నం సమయంలో చేరాయి. బీడు భూములను తడిపి ఏండ్లనాటి రైతాంగం గోస తీరుస్తున్న గోదావరి.. యాదాద్రి నారసింహుడి తెప్పోత్సవం, నిత్య కైంకర్యాలు, భక్తులకు నీటి ఇబ్బందులను తీర్చేందుకు సైతం తరలిరావడంతో ఆ పుణ్య జలాలను చూసి భక్తజనం మురిసిపోయింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గోదావరి జలాలను రాగి బిందెలో తీసుకురాగా.. ఆ జలాలతోనే ఆలయం, యాగశాల సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, స్వామి అభిషేకాలను జరిపారు.
సాయంత్రం పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి బాలాలయంలో నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణం, కుంభస్థాపన తదితర కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. యాగశాల ప్రవేశం సైతం శోభాయమానంగా సాగింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో బాలాలయ ప్రాంగణం మార్మోగింది. మంగళవారం యాగశాలలోని ఐదు కుండలాలలో అగ్ని ప్రతిష్ఠ జరిపి లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సప్తాహ్నిక పంచకుండాత్మక యాగాన్ని ప్రారంభించనున్నారు. పారాయణీకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ యాగం వైభవోపేతంగా కొనసాగనుంది. పాలికలను (మట్టి పాత్రలను) విష్ణుగాయత్రీ మంత్రంతో శుద్ధిచేసి వాటిలో మృత్తిక (మట్టి)ని, ధాన్యాన్ని పోసి నీటితో తడిపి అలంకరించబడే పాలికలను దేవతాస్వరూపములుగా అర్చించి ఆరాధించడం మృత్సంగ్రహణం, అంకురారోపణం ప్రత్యేకతగా అర్చకులు వివరించారు. వేడుకల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, సహాయ కార్యనిర్వహణా ధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.
శాంతిపాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన,ద్వారా తోరణ ధ్వజ కుంభారాధనలు, అగ్ని మధనం, అగ్ని ప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభం, విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్యలఘు పూర్ణాహుతి.
సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతిహోమం, నవకలశ స్నపనం, నిత్య లఘు పూర్ణాహుతి.
ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తిగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేపట్టారు. నిర్మాణానికి పూర్తిగా కృష్ణ శిలలను వాడారు. పూర్తి కృష్ణ శిలలను అమర్చుతూ మరోసారి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణాలు సాగాయి. ఆధునిక నిర్మాణాల్లో శిలల మధ్యలో సిమెంట్‌ను వాడుతుంటారు. కానీ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ప్రాచీనకాలంలో వాడిన గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంద, జనప నార గుజ్జు మిశ్రమాన్ని ఉపయోగించారు. ఈ మిశ్రమాన్ని బెంగళూరులోని బ్యూరో వెర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరీక్షించి సర్టిఫై చేసింది. నాణ్యమైన శిలలతో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కృష్ణశిల నిర్ధారణ కమిటీని వేశారు. ఇందులో సభ్యులుగా స్తపతి సలహాదారు డాక్టర్ వేలు, శిల్పి హరిప్రసాద్, వైటీడీఏ కన్సల్టెంట్ ఇంజినీర్ రాఘవేంద్రరావు ఉన్నారు. వీరు రాష్ట్ర మంతటా పర్యటించి నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. మొదటగా కరీంనగర్, బ్రాహ్మణపల్లి, గురుజపల్లిలో గుర్తించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని గురుజపల్లిలో నాణ్యమైన కృష్ణశిలను ఎంపిక చేశారు. క్వారీల్లోని రాళ్ల నాణ్యతను నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ సంస్థ పరీక్షించింది. రాతితో చెక్కిన శిల్పాల నాణ్యతను మెస్సర్స్ సీవెల్ ఇంజినీర్స్ సంస్థ పరిశీలించింది. మొత్తం దాదాపు 2.5 లక్షల టన్నుల కృష్ణశిలను వినియోగించి ఆలయాన్ని నిర్మించారు.
ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడం కృష్ణశిల ప్రత్యేకత. వేసవి కాలంలో మరీ వేడిగా ఉండకుండా, చలికాలంలో మరీ చల్లగా ఉండకుండా సమతుల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుంది. ఏండ్లు గడిచినా కొద్దీ కృష్ణశిల మరింత పదునుదేలుతూ నాణ్యంగా తయారవుతుంది. ఒకే క్వారీ నుంచి రాయిని తీసుకోవడం గతంలో ఎన్నడూ లేదు.