మర్పల్లి, నవంబర్ 26 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెలకు వరంగా మారింది. ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కావడంతో పాటు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగా మండలంలోని పట్లూర్ గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామ జనాభా 5,685 మంది ఉండగా, పురుషులు 2,810 మంది, 2,875 మంది స్త్రీలు ఉన్నారు. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి, సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది ప్రతి రోజు ఉదయం వీధులను శుభ్రం చేస్తుండడంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. గ్రామంలోని 500లకు పైగా విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలను వేశారు. అనుబంధ గ్రామం పట్లూర్ తండాలో 30 విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో 95 శాతం మరుగుదొడ్లను నిర్మించుకుని వినియోగించుకుంటున్నారు. తాత ముత్తాతల కాలంలో రైతులు పొలాల వద్దకు వెళ్లే బైపాస్ (పానాది) రోడ్డు కలుపు మొక్కలతో నిండి నడవలేని విధంగా ఉండేది. వాటిని జేసీబీతో తొలగించి మొరం పోసి రూలర్‌తో చదును చేశారు. బీజేఆర్ చౌరస్తా నుంచి ఘణాపూర్ రోడ్డు వరకు ఉన్న పెంట కుప్పలను తొలగించి మొరంతో చదును చేసి, హరితహారం మొక్కలు నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. బీజేఆర్ చౌరస్తా, జిల్లా పరిషత్ పాఠశాల వద్ద విద్యుత్ హైమాస్ట్ స్తంభాలు ఏర్పాటు చేసి ఎల్ఈడీ లైట్లను బిగించారు. పట్లూర్, పట్లూర్ తండాలో 5 పాడావు బావులను పూడ్చి వేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న 10 పాడు బడిన ఇండ్లను కూల్చి వేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ.కోటి 39 లక్షలతో అభివృద్ధి పనులు..
గ్రామంలో మొత్తం రూ. కోటి 39 లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, రైతుల పొలాలకు రూ. 25 లక్షలతో ఫార్మేషన్ రోడ్లు, గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ డ్రైనేజీ, రూ.8 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేశారు. రూ. 3 లక్షల 50 వేలతో గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయగా, రూ. 2 లక్షలతో ఓపెన్ బావులపై ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. రూ.లక్షతో పడావు బావులను మూసివేశారు. రూ.5 లక్షలతో హరితహారం, రూ. లక్షా 50 వేలతో నర్సరీని నిర్మించగా, రూ. 3 లక్షల 50 వేలతో ఎల్ఈడీ లైట్లు వేశారు. రూ. 26 లక్షలతో రైతు వేదిక నిర్మించారు. రూ.12 లక్షల 50 వేలతో వైకుంఠధామం నిర్మించగా, రూ.2 లక్షల 50 వేలతో కంపోస్టుషెడ్డును నిర్మించారు. రూ.9 లక్షలతో చెత్త సేకరణకు ట్రాక్టర్ కొనుగోలు, రూ. లక్షా 50 వేలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిపేర్, పెయింటింగ్ పనులు చేశారు. రూ. 2 లక్షలతో రెండు కల్వర్టుల నిర్మించారు. ప్రతి నెలా వచ్చే ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం..
గ్రామస్తులు, పంచాయతీ పాలకుల సమష్టి కృషితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే ప్రతి వీధిలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం. ప్రతి వీధిలో విద్యుత్ దీపాలను అమర్చాం. వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణాలు పూర్తి కాగా, అందుబాటులోకి వచ్చాయి. హరితహారం మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నాం.
-ఇందిర అశోక్, సర్పంచ్ పట్లూర్
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం..
అభివృద్ధి, స్వచ్ఛతలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ప్రతి వీధిని నిత్యం శుభ్రం చేయడంతో పాటు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నాం. పడావు బావులను పూడ్చి వేశాం. శిథిలావస్థలో ఉన్న ఇండ్ల తొలగించాం. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. ఇంటింటికీ మిషన్ భగీరథతో తాగునీటిని సరఫరా చేస్తున్నాం. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీని నిర్మించాం.
-సంతోష, పంచాయతీ కార్యదర్శి, పట్లూర్