ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో 1959 సంవత్సరంలో పాఠశాల ఏర్పాటైంది. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7 వసతిగృహాలు ఏర్పాటు చేయగా ఇందులో ఆత్మకూరు(ఎం)లో కూడా ఓ వసతిగృహాన్ని నెలకొల్పారు. స్థానిక పాఠశాలలో పదో తరగతి వరకూ బోధిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం 1960 సంవత్సరంలో బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ నుంచి 50 శాతం, గ్రామ పంచాయతీ నుంచి 50 శాతం నిధులతో వసతి గృహాన్ని నడిపించేవారు. 1960 మొదటగా గ్రామంలోని రచ్చ రామస్వామి ఇంట్లో వసతి ఏర్పాటు చేయగా 2 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు 30 మంది ఉండేవారు. 1962లో మేర బుచ్చయ్య ఇంట్లో 50 మంది విద్యార్థులు వసతి పొందగా, 1980లో రచ్చ అంజయ్య ఇంట్లోనూ మరో వసతి గహాన్ని ఏర్పాటు చేశారు. 1971 సంవత్సరంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లుగా నామకరణం చేశారు. నాడు నకిరేకల్, నార్కట్పల్లి, అర్వపల్లి, తిరుమలగిరి, జీడికల్, మునిపంపుల, వర్ధమాన్కోట, తాటిపాముల, అనంతారం, సీతారాంపురం, మాటూరు, వీరవెల్లి, రెడ్లరేపాక, వలిగొండ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి వసతిగృహంలో ఉండి చదువుకునేవారు. 1998లో మండల కేంద్రంలో పక్కా భవనం ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా మారింది.
1960లో ఆత్మకూరు(ఎం)లో ఏర్పాటు చేసిన బాలుర వసతి గృహంలో ఉంటూ 2 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పట్లో చాలీచాలని వసతులు ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి వసతిగృహంలో ఉంటూ చదువుకున్న ఎంతో మంది నేడు మంచి హోదాలో ఉన్నారు.
– మేడి రామనర్సయ్య, పూర్వ వసతి గృహం పూర్వ విద్యార్థి, ఆత్మకూరు(ఎం)