హన్వాడ ఏప్రిల్ 8 : మండలంలో సాగునీటి వసతి లేక, భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చే దశలోనే పంటలు కండ్ల ముందు ఎండిపోతుంటే ఏమి చేయని దినస్థితిలో రైతులు ఉంటున్నారు. మరి కొంత మంది రైతులు పంటలను కాపాడుకునేందుకు గోస పడుతున్నారు. మండలంలోని మాదా రం గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి తనకున్న 2 ఎకరాల 10 గుంటలు, భగవంత్‌రెడ్డి 30 గుంటల్లో మొత్తం మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశారు.
వీరి పొలంలో ఉన్న రెండు బోర్లు అడుగంటిపోవడంతో మొత్తం వరిపంట ఎండిపోయింది. గోపాల్‌రెడ్డి ఎకరాలకు రూ.20 వేల చొప్పున ఖర్చు చేయగా మొత్తం పెట్టుబడి రూ.50వేల ఖర్చు అయిందని తెలిపాడు. భగవంత్‌రెడ్డి రూ.15వేల దాకా పెట్టుబడి పెట్టినట్లు తెలిపాడు. పంట పూర్తిగా ఎండిపోవడంతో తెచ్చిన అప్పును ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
కరెంట్ కోతలతో..
మూసాపేట, ఏప్రిల్ 8 : మండలంలోని తుంకినీపూర్ గ్రామంలో కరెంట్ సమస్యలతో సాగునీరు అందక పంట లు ఎండుతున్నాయి. అన్నదాతలు పెట్టుబడి పెట్టి రాత్రి పగలు శ్రమించి సాగుచేసిన పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు నష్టపోతున్నారు. గ్రామానికి చెందిన నర్సిములు తనకు ఉన్న ఎకరం పొలంలో వరి పంట సాగుచేశాడు. ఇతనికి, ఇతని దాయాదులందరికీ కలిపి ఒక బోరు బావి ఉంది. ఐదు కుప్పలుగా ఉండడంతో ఐదురోజులకు ఒకసారి సాగునీరు పారబెట్టుకునే అవకాశం వస్తుంది. ఆ బోరుతోనే వంతుల వారీగా సాగునీరు అందిస్తూ పంట ను సాగుచేశాడు. ఇప్పటివరకు మొత్తం రూ.20వేల వర కు పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపారు. కానీ నెలరోజులు గా విద్యుత్ సమస్యలు తలెత్తడంతో తన వంతు వచ్చిన సమయంలో విద్యుత్ సమస్యతో బోరు పనిచేయలేదని, దీంతో పంటకు సాగునీరు అందించలేకపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.