తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ఈ నెల 24న రాజస్థాన్లోని 200 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరుగనున్నది. అయితే రాజస్థాన్లోని నాలుగు స్థానాల్లో మాత్రం అత్యంత సన్నిహిత బంధువులు పోటీ పడుతున్నారు. ఒక స్థానంలో భార్యాభర్తలు పోటీ చేస్తుంటే, మిగతా స్థానాల్లో సమీప బంధువులు పోటీలో ఉన్నారు.
సికార్ జిల్లా దంతా రాంగఢ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న రీటా చౌదరి మాట్లాడుతూ.. ‘మహిళలకు సాధికారత, తాగునీటి సౌకర్యంపై నేను మరింత ఫోకస్ చేస్తున్నా’ అని చెప్పారు. హర్యానా కేంద్రంగా పని చేస్తున్న జన్నాయక్ జనతా పార్టీ అభ్యర్థిగా రీటా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె భర్త వీరేంద్ర చౌదరి ప్రస్తుతం సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. తిరిగి ఆయన అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజస్థాన్ మాజీ పీసీసీ అధ్యక్షుడు నారాయణ్ సింగ్ తనయుడే వీరేంద్ర చౌదరి.
సాధారణంగా వీరేంద్ర చౌదరి కుటుంబం సాధారణంగా సంప్రదాయంగా కాంగ్రెస్ మద్దతుదారుగా నిలిచింది. కానీ గత ఆగస్టులో రీటా చౌదరి జన్నాయక్ జనతా పార్టీలో చేరారు. ఆ వెంటనే ఆమెను జేజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు.
ధోల్పూర్ స్థానంలోనూ బరిలో ఇద్దరు అభ్యర్థులూ ఒకే కుటుంబానికి చెందిన వారు. 2018లో బీజేపీ నుంచి గెలుపొందిన శోభారాణి కుశ్వాహ్.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శివ చరణ్ కుశ్వాహ్ పై విజయం సాధించారు. శివ్ చరణ్ మరదలు శోభారాణి. గతేడాది రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినందుకు శోభారాణిని బీజేపీ బహిష్కరించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి శోభారాణి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి శివ చరణ్ బరిలో నిలిచారు. రాజకీయాలు, బంధుత్వాలు వేర్వేరు అని శోభారాణి పేర్కొన్నారు.
నాగౌర్, ఖేత్రి సీట్లలో తమ మేన మామలపై మేన కోడలు, కూతురు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ జ్యోతి మీర్దా కొంత కాలం క్రితం బీజేపీలో చేరారు. దీంతో నాగౌర్ స్థానంలో ఆమె బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిస్తే, ఆమె మేనమామ హరేంద్ర మీర్దా కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఝుంఝును జిల్లాలోని ఖేత్రీ సీటులో ధరంపాల్ గుర్జార్ బీజేపీ తరుఫున పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు దాతారామ్ గుర్జార్ కూతురు మనీషా గుర్జార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంతకుముందు బీజేపీలో ఉన్న మనీషా గుర్జార్.. తన తండ్రి సోదరుడు ధరంపాల్ గుర్జార్కు బీజేపీ టికెట్ ఇవ్వడంతో తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు 1875 మంది పోటీలో ఉండగా, కేవల 183 మంది మాత్రమే మహిళలు బరిలో నిలిచారు.