ముంబై : సవతికూతురికి అన్నీ తానై చూసుకోవాల్సిన వ్యక్తి కామాంధుడిలా మారి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి ఒడిగడ్డిన హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి (45)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ ముంబైలోని బాంబే ఆస్పత్రికి సమీపంలోని ఇంటిలో నిందితుడు సవతికూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
హెచ్ఐవీ రోగి అయిన నిందితుడి ద్వారా మైనర్ బాలికకు ఇన్ఫెక్షన్ సోకిందా అని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. బాలిక తల్లిని కూడా హెచ్ఐవీ పాజిటివ్‌గా గుర్తించారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని నిందితుడు బాలికను బెదిరించాడు. జరిగిన విషయం బాలిక పొరుగింటి వారికి తెలపడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
బాలిక ఫిర్యాదుతో ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన రోజే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలల సంక్షేమ కమిటీకి చెందిన నిపుణుల బృందం బాధితురాలికి కౌన్సెలింగ్ నిర్వహించింది. బాలికపై నిందితుడు గతంలోనూ లైంగిక దాడులకు పాల్పడ్డాడా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు చెప్పారు.