హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మైనారిటీ నేత ఇంతియాజ్ అహ్మద్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలనలో మైనారిటీలకు కొత్తగా చేసింది ఏదీలేదని దుయ్యబట్టారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో రేవంత్‌రెడ్డి కోత పెడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో మైనారిటీలకు 204 గురుకులాలను ఏర్పాటు చేస్తే.. వాటిని నిర్వీర్యం చేసే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. గురుకులాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల్లో కాంగ్రెస్ సర్కార్ కోత విధించిందని, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చే సర్వీస్ చార్జీలను కూడా తగ్గించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీతాలను తగ్గిస్తూ తెచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే మైనారిటీ విద్యా సంస్థలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మైనారిటీలకు కేసీఆర్ హయాంలో స్వర్ణయుగంలా ఉండేదని, కానీ కాంగ్రెస్ పానలో అందుకు భిన్నంగా ఉన్నదని బీఆర్ఎస్ మైనారిటీ నేత ఆజం అలీ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ నేత మసియుల్లా ఖాన్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని మైనారిటీలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత బద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.