ఖమ్మం, సెప్టెంబర్ 18: రైతుల ఇబ్బందులపై వార్తలు రాస్తే తప్పేంటని అఖిలపక్ష నేతలు, జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘యూరియా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలకు గురిచేస్తారా?’ అంటూ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసేందుకు బాధ్యతగల జర్నలిస్టులుగా తమ ధర్మాన్ని నిర్వర్తించిన టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావుపైనా,
ఆ చానెల్ సిబ్బంది నాగరాజు, రాకేశ్లపైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి అఖిలపక్ష నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతలు హాజరయ్యారు. టీ న్యూస్ జర్నలిస్టులపై కేసులు బనాయించడాన్ని ముక్తకంఠంతో ఖండించారు. టీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, సీపీఐ, బీఆర్ఎస్ నేతలు పోటు రంగారావు, బాగం హేమంతరావు, పగడాల నాగరాజు తదితరులు మాట్లాడుతూ.. యూరియా లభించక రైతులు ఎదురొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వార్తలు కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై నిర్బంధాలు కొనసాగించడం తగదని అన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై కేసు నమోదు చేయాలంటే భయపడేలా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
టీ న్యూస్ జర్నలిస్టులతోపాటు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపైనా కేసులు ఉపసంహరించుకోకపోతే మరోసారి ప్రత్యక్ష ఆందోళనకు దిగనున్నట్లు స్పష్టం చేశారు. మీడియాపై అణచివేత ధోరణిని మానుకోవాలని అన్నారు. యూరియా కొరత సమస్యను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఇలా తప్పుడు కేసులు పెడుతోందని స్పష్టం చేశారు. పలు పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతలు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, క్లెమెంట్, నరేందర్, వెంకటేశ్, శెట్టి రజినీకాంత్, ప్రశాంత్‌రెడ్డి, మురారి, భూపాల్, మహేందర్, ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావు, బొల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు విమర్శించారు. యూరియాపై వాస్తవాలను అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, ఇటు ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టి కక్ష సాధిస్తోందని స్పష్టం చేశారు.
ప్రజా శ్రేయస్సు కోసం స్వతంత్రంగా పనిచేస్తున్న మీడియాపై అణచివేత ధోరణిని మానుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు హితవు చెప్పారు. కేసులు, నిర్బంధాలతో మీడియాను లోబర్చుకోవాలని చూడడం తగని అన్నారు. యూరియా వార్తల కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు పెట్టం అన్యాయమన్నారు.
ప్రభుత్వాలు మీడియా స్వేచ్ఛను హరిస్తున్నాయని సీపీఐ నేత బాగం హేమంతరావు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరించడం సరికాదన్నారు. తెలంగాణలో యూరియా సమస్యను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యం కాదని అన్నారు.
జర్నలిస్టులపై అకారణంగా కేసు నమోదు చేసే పద్ధతి మానుకోవాలని ఐజేయూ నాయకుడు రాంనారాయణ సూచించారు. జర్నలిస్టులపై కేసు నమోదైతే ఆ ప్రభావం వారి కుటుంబంపైనా ఉంటుందని అన్నారు. తప్పుడు కేసులు పెడుతున్న అధికార పార్టీకి, అధికారులకు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.