కాసిపేట : తెలంగాణలో ప్రకృతి అందాలకు కొదువే లేదు. అంతరంగ, పల్లగట్టు, కుంటాల, బొడకుండ, బోగత తదితర జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వర్షకాలం వచ్చిందంటే ఈ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి మొదలవుతుంది. అదేతరహాలో మంచిర్యాల( Mancherial ) జిల్లాలోని కాసిపేట మండలం సాలేగూడ వాటర్ ఫాల్స్(Saleguda Waterfal) అందాలు అదర్స్ అనిపిస్తున్నాయి.
ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సాలేగూడ జలపాతం కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతుంది. చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆదివాసీ పల్లె దగ్గరలో ప్రకృతి సోయగాల నడుమ ఉన్న వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు అక్కడి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. కాసిపేట మండలం గట్రావ్ పల్లి పంచాయతీలోని సాలేగూడ గ్రామం నుంచి సుమారు 2 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఈ వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి.