నవీపేట, మే 31: మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని నిజాంపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమంగా తరలించడం గమనార్హం. కొన్నిరోజులుగా నిజాంపూర్ వాగులో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారు.
వాగు నుంచి ఇసుకను ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలిస్తున్నా, సంబంధిత అధికారులు కనీసం ఇటు వైపు కన్నెత్తి సైతం చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నిజాంపూర్ వాగులో అనధికార పాయింట్ ద్వారా అక్రమార్కులు ఇసుక దందా సాగిస్తున్నారు.రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక తహసీలార్ద్ వెంకటరమణను వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరు.