హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు భారత రైల్వే.. దక్షిణ మధ్య రైల్వే, ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యంతో సమగ్ర ట్రాఫిక్ అంచనా అధ్యయనాలు నిర్వహించేందుకు ఒప్పందం కుదిరింది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలు, ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, వివిధ రవాణా వ్యవస్థల అనుసంధానాన్ని మెరుగుపరచడంపై ఐఐటీ హైదరాబాద్ అధ్యయనం చేయనున్నది.
డ్రోన్ల ద్వారా నిఘా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ ఆధారిత సీసీటీవీ విశ్లేషణ చేయనున్నారు. ప్రయాణికుల క్షేత్రస్థాయి సర్వేలు, ట్రాఫిక్ సిమ్యులేషన్లను వినియోగించి, డేటా ఆధారిత పరిషారాలను అభివృద్ధి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వీటి ద్వారా ప్రయాణికుల భద్రత, రైల్వే స్టేషన్ల నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్ణయించారు.