మక్తల్, ఆగస్టు 28 : మక్తల్‌లో కన్న కొడుకు ఎదుటే తల్లిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మహేశ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మక్తల్ పట్టణంలో 53 ఏండ్ల మహిళ యాచకురాలిగా జీవనం సాగిస్తున్నది. ఈ నెల 27న తెల్లవారుజామున పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిద్రిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి.. గాయపరిచి పరారయ్యారు.
రక్తపు మడుగులో ఉన్న ఆమెను వాకింగ్‌కు వచ్చిన పలువురు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎస్పీ వినీత్‌కుమార్ ఆదేశాల మేరకు సీఐ రామలాల్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టి 36 గంటల్లోనే నిందితులను గుర్తించారు. బోయ అరవింద్ (19), బోయ విజయ్ (19)ను మక్తల్ సమీపంలో అదుపులోకి తీసుకొన్నారు.