ఆరోగ్యం కోసం.. ఇప్పుడంతా ఇత్తడి, రాగి పాత్రలే వాడుతున్నారు. వీటిలోనే ఆహారం వండుకుంటూ, తింటూ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ, వీటిని సరిగ్గా శుభ్రం చేయలేక తిప్పలు పడుతున్నారు. ఇత్తడి, రాగి పాత్రలు ఇట్టే శుభ్రం కావాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!
ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని, కొద్దిగా వెనిగర్ కలపాలి. ఇందులోనే రెండు టీస్పూన్ల నిమ్మ రసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపేయాలి. ఈ నీటితో రాగి పాత్రలను తోమితే తళతళా మెరిసిపోతాయి. వెనిగర్ లేకపోతే.. పంచదార కలిపినా అంతే ప్రయోజనం కలుగుతుంది.
ఒక గిన్నెలోకి కొద్దిగా టమాటా కెచప్, వెనిగర్, కొద్దిగా డిటర్జెంట్ కలిపి.. బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో ఇత్తడి సామాన్లు బాగా రుద్ది తోమితే.. కొత్తవాటిలా తయారవుతాయి.
ఇత్తడి పాత్రలు బాగా మురికి పట్టినట్టుగా తయారైతే.. వెనిగర్, బేకింగ్ సోడాను సమాన భాగాలుగా తీసుకొని.. కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. దీనిని ఇత్తడి వస్తువులపై పూసి.. 10- 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కడిగేస్తే సరి.