Pumpkin | భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి గుమ్మడికాయలను ఆహారంగా తింటున్నారు. వీటితో స్వీట్లు లేదా కూరలు చేస్తుంటారు. గుమ్మడికాయ ఎంతో రుచిగా ఉంటుంది. గుమ్మడికాయ, బెల్లం కలిపి చేసే కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఆయుర్వేద ప్రకారం గుమ్మడికాయ మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. గుమ్మడికాయను తింటే అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు వచ్చే అనేక వ్యాధులను నయం చేస్తాయి. గుమ్మడికాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
గుమ్మడికాయల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. అందువల్లే ఇవి చూడచక్కని నారింజ రంగులో ఉంటాయి. బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. విటమిన్ ఎ వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. రేచీకటి సమస్య తగ్గుతుంది. గుమ్మడికాయల్లో లుటీన్, జియాజాంతిన్ అనే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తాయి. దీని వల్ల వృద్ధాప్యంలోనూ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుమ్మడికాయల్లో విటమిన్ సి, ఎ అధికంగా ఉండడం వల్ల మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. శరీరంలో తెల్ల రక్త కణాలు, యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. జీర్ణాశయం, పేగుల గోడలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో సూక్ష్మ క్రిముల నుంచి రక్షణ లభిస్తుంది.
గుమ్మడికాయల్లో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లుఅధికంగా ఉండడం వల్ల ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కాయల్లో ఉండే ఫైబర్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. గుమ్మడికాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల గుమ్మడికాయలను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. గుమ్మడికాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. దీని వల్ల సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి రక్షణ లభిస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
గుమ్మడికాయల్లో ఉండే ఫైబర్ వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు రక్తంలో నెమ్మదిగా గ్లూకోజ్‌గా మారుతాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. గుమ్మడికాయల్లో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఒక కప్పు ఉడకబెట్టిన గుమ్మడికాయలను తినడం వల్ల సుమారుగా 49 క్యాలరీల శక్తి లభిస్తుంది. 12 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్లు, 0.2 గ్రాముల కొవ్వులు లభిస్తాయి. గుమ్మడికాయలను తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ ఎ లో దాదాపుగా 200 శాతం వరకు అధికంగా లభిస్తుంది. విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె, ఐరన్, మెగ్నిషియం, ఫోలేట్, ఇతర బి విటమిన్లను కూడా మనం గుమ్మడికాయలతో పొందవచ్చు. దీని వల్ల పోషకాహార లోపం తగ్గుతుంది. ఇలా గుమ్మడికాయలను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.