Sweet Corn | సాధారణ మొక్కజొన్న మనకు కేవలం సీజన్లోనే లభిస్తుంది. కానీ స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటుంది. స్వీట్ కార్న్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీన్ని ఎక్కువగా ఉడకబెట్టి తింటారు. అందులో కాస్త ఉప్పు, కారం చల్లి తింటే వచ్చే మజాయే వేరుగా ఉంటుంది. కొందరు స్వీట్ కార్న్ గింజల్లో కాస్త నెయ్యి కలిపి కూడా తింటారు. ఇది కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే స్వీట్ కార్న్‌ను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..? ఇందులో ఏయే పోషకాలు ఉంటాయి..? స్వీట్ కార్న్‌ను రోజూ తింటే ఎంత మొత్తంలో తినాలి..? వంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఇక వీటిని నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వీట్ కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇఇ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
స్వీట్ కార్న్ ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తుంది. అంటే దీన్ని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. స్వీట్ కార్న్‌లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి రెటీనాను సంరక్షిస్తాయి. డిజిటల్ తెరల నుంచి వెలువడే నీలి రంగు కిరణాల బారి నుంచి కళ్లను రక్షిస్తాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. స్వీట్ కార్న్ లో అధికంగా ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. స్వీట్ కార్న్‌లోని పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. స్వీట్ కార్న్‌లో ఫెరులిర్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి.
స్వీట్ కార్న్ అంటే సహజంగానే చాలా మంది తియ్యగా ఉంటుందని, డయాబెటిస్ ఉన్నవారు తినకూడదని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారు సైతం స్వీట్ కార్న్‌ను తినవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఆహారంలోని పిండి పదార్థాలు త్వరగా గ్లూకోజ్ గా మారకుండా ఉంటాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు సైతం స్వీట్ కార్న్‌ను ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ కార్న్ ను మోతాదులోనే తినాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యవంతులు స్వీట్ కార్న్‌ను రోజుకు ఒక కప్పు మోతాదులో తినవచ్చు. స్వీట్ కార్న్ గింజలను తీసి ఉడకబెట్టి కాస్త ఉప్ప, కారం చల్లి తినవచ్చు. మిరియాల పొడి చల్లి తింటే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. మీరు తినే సలాడ్స్‌లో ఈ గింజలను కలిపి కూడా తినవచ్చు. సూప్‌లలోనూ వేసి తీసుకోవచ్చు.
ఒక మీడియం సైజ్ స్వీట్ కార్న్ దాదాపుగా 90 గ్రాముల గింజలను కలిగి ఉంటుంది. వీటిని పూర్తిగా తింటే 90 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 19 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, చక్కెరలు 6 గ్రాములు, ప్రోటీన్లు 3 గ్రాములు, కొవ్వులు 1 గ్రాము ఉంటాయి. స్వీట్ కార్న్‌ను తింటే మనకు విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఒక స్వీట్ కార్న్‌ను పూర్తిగా తినడం వల్ల మనకు రోజుకు కావల్సిన విటమిన్ సి లో 7 మిల్లీగ్రాముల వరకు పొందవచ్చు. అలాగే పొటాషియం 243 మిల్లీగ్రాములు లభిస్తుంది. మెగ్నిషియం 33 మిల్లీగ్రాములు, విటమిన్ బి9 కూడా లభిస్తుంది. విటమిన్ బి9 వల్ల గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది. శిశువు ఎదుగుదలకు సహాయం చేస్తుంది. ఇలా స్వీట్ కార్న్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.