Almond Oil | బాదంపప్పును తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బాదంపప్పును తింటే అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పలు వ్యాధులను నయం చేస్తాయి. బాదంపప్పును రోజూ నీటిలో నానబెట్టి తినాలని పోషకాహార నిపుణులు, వైద్య నిపుణులు సూచిస్తుంటారు. బాదంపప్పులతో స్వీట్లను కూడా తయారు చేస్తుంటారు. అయితే బాదంపప్పు మాత్రమే కాదు, దీని నూనె కూడా మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. బాదంనూనెలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బిటర్ ఆల్మండ్ ఆయిల్ కాగా మరొకటి స్వీట్ ఆల్మండ్ ఆయిల్. బిటర్ ఆల్మండ్ ఆయిల్ పేరుకు తగినట్లుగానే చేదుగా ఉంటుంది. దీన్ని ఔషధంగా లేదా మసాజ్ కోసం వాడుతారు. కనుక దీన్ని లోపలికి తీసుకోకూడదు. కానీ స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌ను మాత్రం నేరుగా లోపలికి తీసుకోవచ్చు. లేదా వంటకాల్లోనూ ఉపయోగించవచ్చు. ఈ క్రమంలోనే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
స్వీట్ ఆల్మండ్ ఆయిల్ లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ నూనెలో ఓలియిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది ఒమెగా 9 ఫ్యాటీ యాసిడ్ల జాబితాకు చెందుతుంది. అందువల్ల ఈ నూనెను తీసుకుంటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. బాదంనూనెలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడు యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. దీంతో చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశ్తి పెరుగుతాయి. తియ్యని బాదంనూనెను స్వల్ప మొత్తాల్లో తీసుకుంటే సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది.
బాదం నూనెలో విటమిన్ ఇ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోజూ ఒక టేబుల్ స్పూన్ తియ్యని బాదంనూనెను తీసుకోవడం వల్ల విటమిన్ ఇ అధికంగా లభించి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తుంది. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బాదంనూనెను చర్మానికి లేదా శిరోజాలకు రాయవచ్చు. ఇది మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మానికి కావల్సిన తేమను, మృదుత్వాన్ని అందిస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి మేలు చేస్తుంది. బాదంనూనెలో ఉండే విటమిన్ ఇ వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. దీంతో ముఖం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. బాదంనూనెలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు కుదుళ్ల వద్ద ఉండే దురదను తగ్గిస్తాయి. చుండ్రు నుంచి బయట పడేలా చేస్తాయి. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.
స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌ను కొందరు వంట నూనెగా కూడా ఉపయోగిస్తారు. కొందరు నేరుగా తీసుకుంటారు. అయితే ఫుడ్ గ్రేడ్, అన్ రిఫైన్డ్, వర్జిన్ అనే పేర్లతో ఉండే స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌ను వాడడం మంచిది. ఇలా లభించూ నూనె అధిక నాణ్యతను కలిగి ఉంటుంది. పోషక విలువలు అధికంగా ఉంటాయి. బిటర్ ఆల్మండ్ ఆయిల్‌ను లోపలికి తీసుకోకూడదు. కానీ చర్మం లేదా శిరోజాలకు రాయవచ్చు. తియ్యని బాదంనూనెను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుంటే 120 క్యాలరీల శక్తి లభిస్తుంది. మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు 9.4 గ్రాములు, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు 2.3 గ్రాములు లభిస్తాయి. విటమిన్ ఇ ని అధిక మొత్తంలో పొందవచ్చు. స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌ను కేవలం వంటల్లోనే కాక సలాడ్స్, స్మూతీలపై చల్లి కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ నూనెను తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.