Heart Attack Symptoms | ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే వయో భారం వల్ల హార్ట్ ఎటాక్‌లు, ఇతర గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అస్తవ్యస్తమైన జీవన విధానం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వేళకు భోజనం చేయకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, నూనె పదార్థాలు, ఇతర జంక్ ఫుడ్‌ను అధికంగా తినడం, శారీరక శ్రమ చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, నిద్ర సరిగ్గా పోకపోవడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది వాస్తవానికి ఒక మెడికల్ ఎమర్జెన్సీ. అందువల్ల ఇది వస్తేనే గానీ దీని లక్షణాలు ఎవరికీ తెలియవు. అయితే కొందరికి హార్ట్ ఎటాక్ వచ్చేందుకు కొన్ని రోజులు, నెలలు లేదా కొన్ని గంటల ముందు కూడా పలు లక్షణాలు, సంకేతాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు స్త్రీ, పురుషుల్లో లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. ఇవి లింగాన్ని బట్టి మారవు. కానీ వ్యక్తులను బట్టి మారుతాయి. కొన్ని లక్షణాలు కొందరిలో కనిపించకపోవచ్చు. కానీ కొన్ని లక్షణాలు మాత్రం అందరిలోనూ కామన్ గా కనిపిస్తాయి. అవేమిటంటే.. తీవ్రమైన ఆందోళన చెందడం, భారంగా ఉన్నట్లు అనిపించడం, ఛాతిపై బరువు పెట్టినట్లు అనిపించడం, ఛాతిలో తీవ్రమైన మంట లేదా నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. అలాగే హార్ట్ వచ్చిన వారికి లేదా రాబోతున్న వారికి తరచూ శరీరంలోని పలు భాగాల్లో నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా ఎడమ భుజం, మెడ, ఎడమ చేయి, వెన్నులో నడి మధ్యలో లేదా ఎడమ వైపు, ఎడమ దవడ, పొట్ట పై భాగంలో ఎడమ వైపు తరచూ నొప్పిగా ఉంటుంది. కొందరికి సూదుల్తో గుచ్చినట్లు కూడా అనిపిస్తుంది. ఇవన్నీ హార్ట్ ఎటాక్ కు సూచనలుగా భావించాలి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
హార్ట్ ఎటాక్ రాబోయే సమయంలో శ్వాస తీసుకోవడం తీవ్రంగా కష్టంగా మారుతుంది. ఛాతిలో పొడిచినట్లు నొప్పిగా కూడా అనిపిస్తుంది. ఒళ్లంతా చెమటలు పడుతుంటాయి. ఎంతలా అంటే చల్లని వాతావరణంలో ఫ్యాన్ లేదా ఏసీ కింద ఉన్నా సరే చెమటలు వస్తుంటాయి. ఇది హార్ట్ ఎటాక్‌కు కచ్చితంగా సూచనే అని గ్రహించాలి. అలాగే తరచూ వికారంగా, వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. తలతిరిగినట్లు కూడా ఉంటుంది. తీవ్రంగా అలసటగా అనిపిస్తుంది. కొద్దిగా శారీరక శ్రమ చేసినా లేదా చిన్నపాటి నడక లేదా వ్యాయామం చేసినా, కొన్ని మెట్లు ఎక్కినా తీవ్రంగా అలసిపోయినట్లు ఫీలవుతారు. వీటన్నింటినీ హార్ట్ ఎటాక్‌కు సూచనలుగా భావించాల్సి ఉంటుంది.
ఇక కొందరిలో హార్ట్ ఎటాక్ సైలెంట్ కిల్లర్‌లా వస్తుంది. అంటే ఇది వచ్చే ముందు అసలు ఎలాంటి లక్షణాలు కనిపించవు. హఠాత్తుగా గుండె పోటు సంభవించి ఉన్న చోటనే కుప్పకూలిపోతారు. ఇలాంటి సందర్భాల్లో బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్నే సైలెంట్ హార్ట్ ఎటాక్ అని కూడా అంటారు. కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారికి ఇలా సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్, హైబీపీ, అధికంగా కొలెస్ట్రాల్ ఉండడం వంటి వ్యాధులు ఉన్నవారికి సైలెంట్ హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొందరు మితిమీరిన వ్యాయామం లేదా జిమ్ చేస్తారు. కొందరు పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాల్లో తీవ్రంగా డ్యాన్స్ చేస్తుంటారు. ఇక కొందరు తీవ్రమైన ఒత్తిడిలోనూ ఉంటారు. ఇలాంటి వారందరికీ సైలెంట్ హార్ట్ ఎటాక్ ముప్పు పొంచి ఉంటుంది. కనుక వీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. హార్ట్ ఎటాక్ సంకేతాలను ముందుగానే గుర్తించడం లేదా హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు రోగిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తరలించడం వంటివి చేస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.