Srisailam | శ్రీశైలం : శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజు గురువారం అమ్మవారు కూష్మాండ దుర్గగా దర్శనమిచ్చారు. ఉదయం ప్రాతఃకాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారాలు, చండీహోమం, పంచాక్షరి, బ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు నిర్వహించారు. అలాగే, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపించారు. సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిపించారు. రాత్రి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు జరుగనున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు ఘనంగా జరిగాయి. రెండుసంవత్సరాల నుంచి పదేళ్ల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించారు. కుమారిపూజ నవరాత్రి ఉత్సవాల్లో సంప్రదాయం. ఈ నవరాత్రి మహోత్సవాల్లో చేయబడుతున్న నవదుర్గ అలంకారాలలో భాగంగా భ్రమరాంబాదేవి కూష్మాండ దుర్గగా ప్రత్యేక పూజలందుకుని భక్తులకు దర్శనమిచ్చింది. ఎనిమిది చేతులు, కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల, అమృత కలశాన్ని దాల్చి భక్తులకు దర్శనమిచ్చింది.
సృష్టి లేకుండా జగత్తు చీకటి మయంగా ఉన్నప్పుడు బ్రహ్మాండాన్ని సృష్టించి ఆది స్వరూపిణిగా నిలిచింది. ఈ దేవిని పూజించడంవల్ల సర్వ రోగాలు తొలగిపోయి ఆరోగ్యం, ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని భక్తుల విశ్వాసం. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు కైలాస వాహనసేవ నిర్వహించారు. దసరా మహోత్సవాల్లో ప్రతిరోజూ సాయంత్రం ఆలయం దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదికతో పాటు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఒంగోలుకు చెందిన పొన్నూరు వేంకట శ్రీనివాసులు ప్రవచనం.. జయకృష్ణ భాగవతార్ హరికథ భక్తులను అలరించాయి.