BJP vs Congress : పాకిస్థాన్ (Pakistan) లో ఉంటే తనకు ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నదని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ (Indian Overseas Congress chief) సామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలు బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య రాజకీయ చిచ్చు రాజేశాయి. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయని బీజేపీ మండిపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి (Pradeep Bhandari) ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీకి పాకిస్థాన్‌పై అమర ప్రేమ అని, అందుకే 26/11 ముంబై ఉగ్రదాడుల అనంతరం పాకిస్థాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రదీప్ భండారి ఆరోపించారు. ‘దేశభక్తి ఉన్న ఎవరైనా ఉగ్రవాద దేశమైనా పాకిస్థాన్‌ను సొంత ఇంటిలా ఉందని పొగుడుతారా..? కానీ రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడు, గాంధీ కుటుంబ వ్యూహాలు నిర్ణయించే నేత, గాంధీ కుటుంబంతో 30 సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తి ‘పాకిస్థాన్‌లో ఉంటే తనకు ఇంట్లో ఉన్నట్టే ఉన్నది’ అని చెప్పారు’ అని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే సామ్ పిట్రోడా చేత ఆ వ్యాఖ్యలు చేయించిందని ప్రదీప్ భండారీ ఆరోపించారు. ఇది భారతదేశ జవాన్లకు, 140 కోట్ల మంది భారతీయులకు అవమానమని వ్యాఖ్యానించారు. ‘ఇవి జాతి వ్యతిరేక వ్యాఖ్యలు కాకపోతే మరేమిటి..?’ అని ప్రశ్నించారు. ‘రాహుల్‌గాంధీ తనకు ఆరాధ్యుడు’ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ దేశం కోసం పోరాడుతాను అంటుంటే.. ఆయన పార్టీ నేతలు పాకిస్తాన్ తమకు ఇల్లులా ఉందని అంటున్నారని ఎద్దేవా చేశారు.