Sam Pitroda : ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ (Indian Overseas Congress chief) సామ్ పిట్రోడా (Sam Pitroda) మరో కొత్త వివాదానికి తెరలేపారు. ఇటీవల దాయాది దేశంలో పర్యటించిన ఆయన.. పాకిస్థాన్ (Pakistan) పర్యటనలో తనకు సొంత ఇంట్లో ఉన్నట్టే అనిపించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. పాకిస్థాన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎప్పుడూ సానుకూల వైఖరి కనబరుస్తుందని బీజేపీ విమర్శించింది.
తాజాగా ఫారిన్ పాలసీపై మాట్లాడిన సామ్ పిట్రోడా.. పొరుగుదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లతో సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి భారత్ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా దేశాల్లో పర్యటించినప్పుడు తన వ్యక్తిగత అనుభవాలను గురించి ఆయన పంచుకున్నారు. ‘నేను పాకిస్థాన్‌కు వెళ్లాను. కచ్చితంగా ఈ విషయం మీకు చెప్పాలి. అక్కడ నేను సొంత ఇంట్లో ఉన్నట్టు అనుభూతి చెందాను. నేను బంగ్లాదేశ్‌కు వెళ్లాను. నేపాల్‌కు వెళ్లాను. అక్కడ కూడా ఇంట్లో ఉన్న అనుభూతే కలిగింది’ అని వ్యాఖ్యానించారు.
భారత ప్రజల జీన్స్, ఆయా దేశాల ప్రజల జీన్స్ ఒకటేనని, ఈ అన్ని దేశాల మధ్య దగ్గరి సంబంధాల కోసం సాంస్కృతిక సారూప్యతలు కూడా ఉన్నాయని సామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అయితే ఉగ్రవాదం, హింస లాంటి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని అంగీకరించారు. అయితే పాకిస్థాన్‌ను పొగుడుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదని కాంగ్రెస్ మొదటి నుంచి పాకిస్థాన్‌పట్ల సానుకూల వైఖరే కనబరుస్తోందని విమర్శించింది.