Video viral | వీర్నపల్లి, ఆగస్టు 21 : రైతులకు సకాలంలో యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఓ రైతు అగ్రహం వ్యక్తం చేశాడు. యూరియా సరఫరా చేయలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత..? ఊడితే ఎంత..? చేతకాకుంటే దిగిపోండి అంటూ మండిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆవీడియోలో రైతు ఏం అన్నాడంటే.. ‘కాంగ్రెస్ లో ఉన్న కింది స్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతిపక్ష నాయకులను తిట్టడం తప్ప మరేం పనిలేదేమో వీల్లకు ఈరోజు జరిగిన ఓ చిన్న సంఘటన ఒక లారీ యూరియా వస్తే ఆ లారీ యూరియాను రైతులు అందరూ ఎగబడి ఎగబడి మనిషికో సంచి లాక్కుంటున్నారు.
అయ్యా.. కాంగ్రెస్ నాయకులు కానీ, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకత్వానికి కొంచెం అయిన సోయి లేదా..? రైతులు పంటలు వేసి రెండు నెలలు గడిచినా ఇప్పటికి యూరియా సప్లై చేయలేకపోతున్నారు. ఈ సప్లై చేయకపోవడానికి ముఖ్య కారణం మీరు కాదా.? ఇంత నిస్సహాయమైన స్థితిలో మీరు ప్రభుత్వాన్ని నడపడం దేనికి..? పాలన చేయడం దేనికి..? రైతులకు యూరియాను సకాలంలో సప్లై చేయని, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత..? అయ్యా ఇప్పటి వరకు రైతన్నను బాధపెట్టిన ఏ ముఖ్యమంత్రి అయిన ఏ నాయకుడైన సంతోషంగా ఉన్నట్టు లేదు.. రైతును కష్ట పెట్టకండి.. రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు యూరియా సప్లై చేయలేరు. యూరియా అడిగితే గొడవ పెట్టడం.. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తిట్టడం తప్ప మరేం పనిలేదు. తిట్టడమే పని తప్ప యూరియా సరఫరా చేయడం చేతకాదు మీకు’ అంటూ మండిపడ్డాడు.