అమరావతి : ఆల్మట్టి డ్యాం ( Almatti Dam ) ఎత్తును కర్నాటక ప్రభుత్వం పెంచేందుకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడం దారుణమని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan) అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandra Babu) రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం కనిపించడంలేదని ట్విట్టర్( Twitter ) లో ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి అని నిలదీశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం కేబినెట్లో ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
గతంలో సీబీఎన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణాజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వచేయడానికి అవసరమైన పనులు, స్పిల్‌వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే కేంద్రంలో బలమున్నాగాని అడ్డుకోలేకపోయారని విమర్శించారు. గడచిన రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో కృష్ణాజలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అర్ధమవుతుందని, పేర్కొన్నారు. ఇవన్నీ చంద్రబాబు వైఫల్యాలేనని దుయ్యబట్టారు. కర్నాటక మళ్లీ ఆల్మట్టిలో నీటినిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీనికోసం రానున్న 3 ఏళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయాలని సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకూ మీరెందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
మరోవైపు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జలవివాద ట్రైబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా మేలుకోని కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబుకు సూచించారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు, కృష్ణా ట్రిబ్యునల్ విచారణపై దృష్టిపెట్టి, సమర్థవంతమైన వాదనలు వినిపించాలని , లేకుంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.