హాలియా, ఫిబ్రవరి 11 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన అస్తవ్యస్తంగా, అశాస్త్రీయంగా ఉందని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే దాన్ని రద్దు చేసి మళ్లీ సమగ్రంగా కుల గణన చేపట్టాలని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం హాలియలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన పారదర్శకంగా లేదన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.6 కోట్లు కాగా, 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3.68 కోట్లుగా తేలిందన్నారు. 2024లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో రాష్ట్ర జనాభా 3.70 కోట్లుగా చూపడం సరికాదని పేర్కొన్నారు.
డీలిమిటేషన్ కమిషన్ లెక్క ప్రకారం రాష్ట్ర జనాభా వార్షిక వృద్ధి రేటు 1.35 శాతం ఉందని, గత 13 సంవత్సరాల్లో రాష్ట్ర జనాభా వృద్ధిరేటు 1.95 శాతంగా ఉండవచ్చునని తెలిపారు. పదేండ్లలో రాష్ట్ర జనాభా 2 లక్షల మంది మాత్రమే పెరిగిందని చెప్పడంతోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఎంత పారదర్శకంగా ఉందో అర్ధమవుతుందని విమర్శించారు. 2014లో బీసీలు 51 శాతం ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణనలో 46 శాతానికి ఎలా తగ్గుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీతోపాటు రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలన్నీ ప్రభుత్వ కులగణనను చిత్తుకాగితంగానే పరిగణిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం పరిపాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కులగణన నివేదికను బయటపెట్టింది తప్ప బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. ఏ రాజకీయ ప్రయోజనాలను కాంగ్రెస్ ఆశించిందో.. అదే బీసీలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతున్నారని చెప్పారు.
గుత్తా వ్యాఖ్యలపై ఫైర్
ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన కులగణనకు చట్టబద్ధత ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడడం సరికాదని మాజీ ఎమ్మెల్యే భగత్ అన్నారు. రాష్ట్రంలోని బీసీలంతా కులగణన నివేదినపై దుమ్మెత్తి పోస్తుంటే మండలి చైర్మన్ గుత్తా మాత్రం చట్టబద్ధత ఉందంటూ ప్రభుత్వానికి వంత పాడుతున్నారని విమర్శించారు. ఇక్కడ చట్టబద్ధత ప్రధానాంశం కాదని, ఎంత పారదర్శకంగా ఉంది, ఎంత శాస్త్రీయంగా ఉంది అన్నదే ముఖ్యమని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో కులగణన చేపట్టిన అధికారులే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ సమగ్ర కుటుంబ సర్వే చేశారన్న విషయాన్ని సుఖేందర్‌రెడ్డి మరిచిపోవద్దన్నారు.
తప్పుల తడకగా ఉన్న కులగణన నివేదికను సరిదిద్దాలని ప్రభుత్వాన్నికి సూచించాల్సిందిపోయి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఆయన స్థాయికి సరికాదని పేర్కొన్నారు. సమావేశంలో హాలియా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, నిడమనూరు మాజీ ఎంపీపీ సలహదారుడు బొల్లం రవి, బీఆర్ఎస్ పెద్దవూర మండలాధ్యక్షుడు జఠావత్ రవినాయక్, హాలియా పట్టణాధ్యక్షుడు వడ్డె సతీశ్‌రెడ్డి, త్రిపురారం మండల ప్రధాన కార్యదర్శి పామోజు వెంకటాచారి, నాయకులు బొల్లం సైదులు, సురభిరాంబాబు, మండల యూత్ అధ్యక్షుడు కాట్నం నాగరాజుగౌడ్, శ్రీకర్‌నాయక్, ఉపేందర్, భాస్కర్ పాల్గొన్నారు.