Iran Warning : ఇరాన్ (Iran) తో ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతుండగా, ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనలు రేకెత్తిస్తోంది. తాము హార్ముజ్ జలసంధి (Strait Of Hormuz) ని మూసివేశామని, నౌకలు ఆ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పుపెడతామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని స్ట్రాంగ్‌గా చెప్పింది.
కాగా హార్ముజ్ జలసంధి గుండా ఉన్న మార్గం ఇంధనసరఫరాలో ప్రపంచానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయం అయినా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి.
ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీంనేత ఖమేనీ మృతిచెందడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే హార్ముజ్‌ను మూసివేసింది. డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ గణాంకాల ప్రకారం.. సుమారు 150 ఆయిల్ ట్యాంకర్లు ఇప్పటికే ఈ హర్ముజ్ నుంచి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు హార్ముజ్ తూర్పువైపున 60 ట్యాంకర్లు వేచిచూస్తున్నాయి.
ఫిబ్రవరి మధ్యలోనే సైనిక విన్యాసాల కోసం జలసంధిలో కొంతభాగాన్ని ఇరాన్ మూసివేయగా.. అప్పుడు చమురు ధరలు 6 శాతం పెరిగాయి. ఇప్పుడు ఆ జలసంధిని పూర్తిగా మూసివేస్తే చమురు ధరలు ఇంకా ఏ రేంజ్లో పెరుగుతాయో.. ఆ ధరల ప్రభావం నిత్యావసరాలపై ఎంతగా పడుతుందో అని ఆందోళనలు రేకెత్తుతున్నాయి.