లాస్ ఏంజిల్స్: కృత్రిమ మేధ గురించి గూగుల్ సంస్థకు చెందిన ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఏఐ విస్పోటనం చెందితే, దాని ప్రభావం అన్ని కంపెనీలపై ఉంటుందన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఇదో అసాధారణ సందర్భమని, ప్రస్తుతం కొనసాగుతున్న ఏఐ బూమ్‌లో హేతుబద్దత లేదన్నారు.
అన్ని కంపెనీలు ఏఐపై అతిగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలతో సిలికాన్ వ్యాలీలో కొంత ఆందోళనకరమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏఐ విస్పోటనాన్ని ఎదుర్కొనే రీతిలో గూగుల్ సంస్థ సిద్దంగా ఉందా అని అడిగిన ప్రశ్నకు సుందర్ పిచాయ్ బదులిస్తూ.. ఆ తుఫాన్‌ను తమ కంపెనీ తట్టుకుటుందని, కానీ ఏదైనా సాధ్యమే అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
నిజం చెప్పాలంటే ఏ కంపెనీ కూడా ప్రభావానికి లోనుకాకుండా ఉండలేదన్నారు. ఆ జాబితాలో తాము కూడా ఉంటామన్నారు. చాట్‌జీపీటీ, ఓపెన్ఏఐతో పోటీ ఉన్న నేపథ్యంలో ఆల్ఫాబెట్‌కు పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. ఏఐకి చెందిన సూపర్ చిప్స్‌ను ఆల్ఫా సంస్థ డెవలప్ చేస్తున్నది. ఏఐ చెప్పే విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని పిచాయ్ అన్నారు.