సిద్దిపేట, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గజ్వేల్, డిసెంబర్20: తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారును బొందపెడతామని, రైతులకు అన్యాయం చేయాలని చూస్తే టీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ధాన్యం కొనుగోలులో బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. గజ్వేల్ ఇందిరాపార్కు చౌరస్తా వద్ద నిర్వహించిన ధర్నా సభకు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించగా, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మెదక్ జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్‌గౌడ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీగా నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చేయూతతో రైతులు రికార్డుస్థాయిలో పంటలు పండిస్తున్నారన్నారు. తెలంగాణలో భారీగా ధాన్యం పండుతున్నదని, వడ్లు కొనాల్సిన కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తున్నదన్నారు. తన బాధ్యతను తప్పించుకుంటూ రాష్ర్టాలను, రైతులను మోసం చేస్తున్నదన్నారు. తెలంగాణ రైతులను టీఆర్ఎస్ నుంచి దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లాకు గోదావరి జలాలను తెచ్చి సాగునీటి వెతలు తీర్చారన్నారు. దీంతో మెతుకు సీమ రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో మెతుకు సీమ రైతులను ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదన్నారు. టీఆర్ఎస్ వచ్చాక రిజర్వాయర్లు కట్టించి, గోదావరి జలాలను తెచ్చి, నాణ్యమైన కరెంట్ ఇచ్చి, పంటలు పండించేందుకు రైతుబంధు అందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభు త్వం ఇంత చేస్తుంటే, బీజేపీ రైతులను దగా చేస్తున్నదని విమర్శించారు. ఈ విషయాలన్నీ గ్రామగ్రామానా ఉన్న రైతులందరికీ టీఆర్ఎస్ నాయకులు, రైతు నాయకులు వివరించాలన్నారు. బీజేపీ కుట్రలను, వడ్లు కొనకుండా చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వం కుట్రలను వివరించాలన్నారు. పూటకో మాట మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకు ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నారు. అన్ని ధరలు, ట్యాక్సులు పెంచి బీజేపీ ప్రభుత్వం అన్నివర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. బీజేపీని గద్దె దించాలని, అప్పుడే రైతులు బాగుపడతారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధర పెంచుతున్నదని, బావుల వద్ద కరెంటు మీటర్లు పెడుతున్నదని, జీఎస్టీని చెల్లిస్తే ఇక రైతులు బాగుపడతారా అని మంత్రి అన్నా రు. అందుకే బీజేపీ గద్దెదిగేదాకా పోరాడుదామన్నారు. కాంగ్రెస్, బీజేపీకి రైతులపై ప్రేమలేదన్నారు. పరామర్శలతో నాటకాలాడుతున్న కాంగ్రెస్ లీడర్ల తీరును ప్రజల ముందు ఉంచాలని టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
ధర్నా విజయవంతం..
ధర్నాను విజయవంతం చేసినందుకు రైతులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్నా అనంతరం ఇందిరాపార్కు నుంచి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, రైతుబంధు నాయకులు, రైతులు కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివెళ్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
రైతుల అభివృద్ధి జరుగుతోంది..
బీజేపీ ఒరగబెట్టిందేమీ లేదు…
బీజేపీ బొందపెడితేనే రైతుకు మనుగడ..
వడ్లు కొంటలేరని పడావ్ పెట్టిన..
బీజేపీ వాళ్లు వడ్లు కొనరని చెప్పినరు. అందుకే మూడెకరాలుంటే, ఎకరం పత్తి, ఎకరం మక్కలు పండించిన. ఇంకో ఎకరం బీడుగనే పెట్టిన.. నా పొలంల దొడ్డు రకమే పండుతది. సన్నరకం పండదనే ఖాళీగానే ఉంచిన. అప్పట్ల అప్పులు చేసి, కరువుల కూడా రైతులు పండించినదంత కొన్నరు కదా.. ఇప్పుడు అన్ని ఉన్నాయి. సీఎం కేసీఆర్ పుణ్యాన నీళ్లు వచ్చినయి. మంచిగ పంట వేసుకుందామంటే కొనమంటున్నరంట కదా! అందుకే ఎకరం ఖాళీగనే పెట్టిన.
నా దగ్గరికి బీజేపోళ్లు అస్తే బడితవట్టి కొడత..
మాది పిడిచెడ్. మాకు మల్లన్నసాగర్ కాలువల పు ణ్యాన మంచిగ నీళ్లు వచ్చిన యి. బోర్లల్ల కూడా నీళ్లు బాగయినాయి. ఐదెకరాలు పొలం ఉన్నది. వడ్లు పండి ద్దామంటే కొనరని, రెండు ఎకరాలల్ల పత్తి, రెండు ఎక రాలల్ల మక్కజొన్న ఏశిన. ఎకరం మా ఇంటి మందమే వరి పండించిన. కేంద్ర ప్రభుత్వం కొం టేనే ఇక్కడోళ్లు కొంటరాయే.. వాళ్లు కొనకపోతే వీళ్లు కొనరు కదా! అందుకే మా ఇంటి మందమే వడ్లు పండించుకున్నా. బీజేపోడు నా దగ్గరికి వస్తే బడితవట్టి కొడత.