T20 World Cup : రాబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొనే అంశంపై ఉత్కంఠ మరో 24 గంటల్లో వీడనుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొంటుందో, లేదో తేల్చుకునేందుకు ఆ జట్టుకు 24 గంటల టైమిచ్చింది ఐసీసీ. అయితే, షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్.. ఇండియాలో మ్యాచులు ఆడాల్సిందే అని ఐసీసీ తేల్చి చెప్పింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రమే. ఇటీవల బంగ్లాదేశ్, భారత్ మధ్య విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం క్రికెట్ కు చేరింది. బంగ్లా క్రికెటర్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తొలగించింది. దీంతో భద్రతా కారణాల రీత్యా తాము కూడా ఇండియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోమని బంగ్లా చెప్పింది. తాము ఆడే మ్యాచు వేదికల్ని ఇండియా నుంచి మరో చోటుకు మార్చాలని ఐసీసీని కోరింది. కానీ, ఐసీసీ దీనికి సానుకూలంగా స్పందించలేదు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇండియాలో మ్యాచులు ఆడాల్సిందే అని బంగ్లాకు సూచించింది. ఈ ప్రతిపాదనను బంగ్లా తిరస్కరించింది. దీంతో వివాదం ఎటూ తేలలేదు. మరోవైపు ఐసీసీ.. బంగ్లాకు బుధవారం (నేటి) వరకు గడువిచ్చింది. ఈ గడువు నేటితో ముగిసినా.. మరో 24 గంటలు అదనపు సమయం ఇచ్చింది. బంగ్లా ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడం వెనుక కారణం ఉంది. బంగ్లా ప్రతిపాదనపై ఐసీసీ కౌన్సిల్ ఓటింగ్ నిర్వహించింది.
అంటే బంగ్లాదేశ్ ఇండియాలోనే మ్యాచులు ఆడాలా.. లేక వేరే చోట నిర్వహించాలా అనే అంశంపై ఓటింగ్ పెట్టింది. ఇందులో ఇండియాలో బంగ్లా ఆడాల్సిందే అని 14 ఓట్లు, మరో చోట ఆడాలని 2 ఓట్లు వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ ఇండియాలో మ్యాచులు ఆడాల్సిందే అని ఐసీసీ తుది హెచ్చరిక జారీ చేసింది. దీనిపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుని చెప్పాల్సిందిగా బంగ్లాకు సూచించింది. అంటే ఇండియాలో టోర్నీలో పాల్గొనేది, లేనిది బంగ్లా గురువారం సాయంత్రం లోపు తేల్చాలి. ఒకవేళ బంగ్లా పాల్గొనకుంటే.. ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టును ఆడించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉంది.