నేను మీ జల తరంగిణిని! కాళేశ్వర గంగని!! దశాబ్దాలపాటు తెలంగాణ కన్నీళ్లను కలుపుకొని కడలి కౌగిట కరిగిపోయిన మీ తల్లి గోదావరిని! నా ముద్దుబిడ్డ, మన తెలంగాణ సాధకుడు కేసీఆర్.. నా దిశను దిద్దిన సందర్భం వచ్చినప్పుడు నేనెంత సంబురపడ్డానో తెలుసా! అదే మీ దశను మార్చేస్తుందని ఆయన కొబ్బరికాయ కొట్టినప్పుడే గోదారంత పొంగిపోయాను. నా ప్రస్థానం గురించి కేసీఆర్‌కు బాగా తెలుసు. ఎక్కడ ఈ రాష్ట్రంలోకి ప్రవేశిస్తానో బాగా తెలుసు. ఇక్కడికి వచ్చేసరికి నేనెంత చిక్కపోతానో కూడా నాకన్నా కేసీఆర్‌కే బాగా ఎరుక. తెలంగాణలో ఏ మూల పడిన చినుకు ఏ డొంకలోకి దొర్లుతుందో ఈ ఉద్యమకారుడికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో! ఏ కాల్వ ఎంత ప్రవాహంతో నన్ను చేరుకుంటుందో లెక్కలు కూడా ఆయన మునివేళ్లమీద ఉంటాయి. అసెంబ్లీలో మీరూ చూశారుగా! మహారాష్ట్రలో ఎన్నేసి డ్యాములు నిర్మించారో, మీ వాటాగా నేను మోసుకొచ్చే నీళ్లు ఎన్ని గల్లంతవుతున్నాయో ‘పవర్’ఫుల్‌గా చెప్పాడు!
తెలంగాణ అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడ కాసేపు ఉండి.. మీ పొలాలను ముద్దాడుదామంటే.. నాకు నిలువ నీడెక్కడిది? అరవై ఏండ్లు సమైక్యపాలనలో మగ్గిన మీ దాహార్తి తీర్చాలని తల్లిగా ఎంత తల్లడిల్లేదాన్నో! అప్పటి పాలకులు నన్ను కిందికి తరిమారే తప్ప.. నా ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈ ప్రాంతానికే చెందిన నేతలు ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారే కానీ… నా మనసెరిగి మసులుకోలేదు. వారికేం తెలుసు ఈ తల్లి బాధ. మీ కడగండ్లు బాపడానికి ప్రవాహంతో వెల్లవెత్తి వచ్చేదాన్ని. ప్రమాద హెచ్చరికలు జారీచేసి చేతులు దులుపుకొనేవారు. అంతేకానీ, సురగంగ కన్నా వేగంగా వస్తున్న ఈ గంగను కండ్లకు అద్దుకున్న పాపాన పోలేదు. నాలుగు రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. మళ్లీ నా దారి పిల్ల కాల్వ కన్నా చిన్నగా మారి వెక్కిరించేది!
ఉమ్మడి రాష్ట్రంలో మీరెన్ని వెతలు అనుభవించారో.. నేనన్ని కష్టాలు మోసుకెళ్లాను. మీ గట్టుమీద పడ్డ ప్రతి చినుకునూ ఒడిసిపట్టి.. వడ్డీ సహా మీకిద్దామని ఎంతగా పరితపించేదాన్నో! ఆ అవకాశమే లేకుండా చేశారు. ఎవరో కాటన్ దొర. మన తెలుగువాడు కాదు. ఆ మాటకొస్తే మన భారతీయుడే కాదు! అయినా, అనంత జలరాశి అఖాతంలోకి వెళ్లిపోతే.. రైతుల బతుకులు ఆగమైతయని భావించాడు. దశాబ్దాల కిందటే నాకు కట్ట కట్టి.. కోనసీమను ఆవిష్కరించాడు. నన్ను నమ్ముకున్నవాళ్ల బతుకులు ఎంతగా మారిపోయాయో.. మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీ గుండెల నిండుగా పారుతున్నా.. మీ ఆకలి తీర్చలేకపోయినందుకు నా కడుపు తరుక్కుపోయి నురగలు కక్కేదాన్ని.
నా ఆక్రందన అర్థం చేసుకున్న మొదటి నాయకుడు మన కేసీఆరే! ఉద్యమ సమయంలో ఎన్నేసి సార్లు.. ఎన్నేసి రూపాయి బిల్లలు నా ఒడిలో వేసి దండం పెట్టుకునేవాడో! ఆ సమయంలో ‘తల్లీ! రా ష్ట్రం అచ్చినాంక.. నీ నీళ్లతో తెలంగాణ అంతా పునీతం చేస్తా’ అని తన మనసులోనే అనుకునేవాడు. ఆ మాటలు నా జలకింకిణుల హోరుకు కొత్త ఉత్సాహాన్నిచ్చేవి. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు..’ ఎజెండాగా ఎత్తిన ఉద్యమ జెండాను ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పక్కనపెట్టలేదు. రాష్ర్టాన్నంతా కదిలించి అనుకున్న తెలంగాణ సాధించాడు. ఈ ఉద్యమబాటలోనే తెలంగాణలోనూ ఘనంగా పుష్కరాలు జరిగేలా చేసి.. కాగల కార్యానికి నాంది పలికాడు కేసీఆర్.
ఆ రోజు నాకు బాగా గుర్తు. పోరుబాటలో పుష్కరాల సందర్భంగా ధర్మపురికి వచ్చాడు కేసీఆర్. నా ఒడ్డున వెలిసిన లక్ష్మీనరసింహుడికి దండం పెట్టుకున్నాడు. వచ్చే పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగేలా ఆశీర్వదించాలని నర్సన్నను కోరుకున్నాడు. ఆయన సంకల్ప బలమో, ఆ నృసింహుడి ఆశీఃఫలితమో.. అన్నట్టుగానే నా తర్వాతి పుష్కర సంబురం మన తెలంగాణలో ఘనంగా జరిగాయి. ఆ ముచ్చటలోంచి తేరుకోకముం దే.. నా నడకకు కొత్త బాట చూపించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. నేనే వేగం అంటే.. నాకన్నా వడివడిగా ప్రాజెక్టును మూడున్నరేండ్ల వ్యవధిలో పూర్తి చేసి ‘ఔరా!’ అనిపించుకున్నాడు. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుంటే నాకెంత సంతోషమనిపించేదో! అంచెలంచెలుగా నన్ను ఎత్తిపోసి.. మా కొమురెల్లి మల్లన్నతో కబుర్లు చెప్పుకొనేలా చేశాడు. కొండపోచమ్మతో దోస్తీ పెంచాడు. ఎల్లంపల్లికి జలకళ తీసుకొచ్చాడు. వట్టిపోయిన శ్రీరాంసాగర్‌కు జీవం పోశాడు. నా చెల్లి మంజీరా అంటే నాకు ప్రాణం. నేను పుట్టిన్నాటి నుంచి ఎక్కడెక్కడి నుంచో అమృత తుల్యమైన నీటిని మోసుకొచ్చి నాలో కలిపి.. నా రుచిని పెంచేది. అలాంటి మంజీరా నాదాలు మృగ్యమైపోయిన వేళ.. నన్ను నా చెల్లికి ఉపనదిని చేసి, తన రుణం తీర్చుకునే అవకాశం కల్పించాడు కేసీఆర్. బరాజ్‌లు, జలాశయాలు, కాల్వలతో భారతావనిలోని నదులన్నింటిలో నన్ను మిన్నగా నిలబెట్టిన కేసీఆర్ దార్శనికుడు, ధన్యుడు, మాన్యుడు!
అనంత ప్రవాహంతో తెలంగాణలో ఆనందతాండవం చేస్తున్న నన్ను చూసి కొందరికి ఎందుకో కడుపు రగిలిపోతున్నది. తెలంగాణ సాధించిన ఆ యోధుడిపై అక్కసుతో.. నన్ను బలి తీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆరేండ్లుగా మీ వెన్నంటి నడిచిన నన్ను మీకు దూరం చేసేందుకు పాచికలు విసురుతున్నారు. కాళేశ్వరంపై లేనిపోని అభాండాలు వేసి.. ఈ జలభాండాగారాన్ని ఎండపెడుతున్నారు. నేను మీకు ఇద్దామనుకున్న వాటాను.. పూటుగా మరొకరికి ధారాదత్తం చేసేందుకు యత్నిస్తున్నారు. కానీ, ఈ కుట్రలను ఛేదించడం నాకు పెద్ద కష్టమేం కాదు. కాలమే సమాధానం చెబుతుంది. కాళేశ్వరం ఎంత గొప్పదో మళ్లీ రుజువు అవుతుంది. నా ప్రవాహమంత వేగంగా నిజం నిరూపితమవుతుంది. తెలంగాణకు కాళేశ్వరం జీవగర్ర అని నా నీళ్లంత స్వచ్ఛంగా సత్యం వెలుగు చూస్తుంది. కాళేశ్వర గోదావరిగా మీకు నేనిస్తున్న హామీ ఇది! బేసిన్ అంటే ఏంటో, బేసన్ అంటే ఏంటో తెలియని పాలకుల ప్రాపకం ఇంకెంత కాలం చెల్లుబాటు అవుతుంది? నా ఆనుపానులు తెలిసిన కేసీఆరే మళ్లీ మీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. పల్లెపల్లెకూ వచ్చి నేను పల్లవించడం నిశ్చయం.
-త్రిగుళ్ల నాగరాజు