సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : హాస్టళ్లలో ఉన్న వారి భద్రత విషయంలో రాజీపడబోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రమాదకరమైన భవనాల్లో హాస్టళ్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అందులో భాగంగా నగరంలోని హాస్టళ్ల నిర్వాహకులతో పాటు.. వాటిని అద్దెకిచ్చిన భవన యజమానులతో బుధవారం హైడ్రా కార్యాలయంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. పటిష్టమైన కట్టడాలతో పాటు అన్ని అనుమతులున్న భవనాల్లోనే హాస్టళ్లు నిర్వహించాలని సూచించారు. ప్రమాదకరమైన భవనాల్లో హాస్టళ్లు నిర్వహిస్తున్న వాళ్లు పటిష్టమైన భవనాల్లోకి వాటిని తరలించాలన్నారు. అందుకోసం 3 నెలల గడువును నిర్దేశిస్తున్నట్టు ఆయన వివరించారు.
జనవరి 1 నుంచి తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. కూలే ప్రమాదమున్న భవనాలను తొలగిస్తామని హెచ్చరించారు. హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లు, భవన నిర్మాణ పటిష్టత వంటి అంశాల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు.. ప్రమాదం జరగకుండా చూడాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. డబ్బు కోసం భద్రతను పకన పెట్టొద్దన్నారు.