న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భార్యకు ఇష్టంలేని శృంగారాన్ని(మారిటల్ రేప్) ప్రత్యేక నేరంగా పరిగణించాలా వద్ద అన్న విషయం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, అది సుప్రీంకోర్టు పరిధిలోనిది కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మూడు వారాల తర్వాత ఈ కేసులో తుది విచారణ ప్రారంభమవుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
విచారణలకు బుధ, గురువారాలను న్యాయస్థానం ఖరారు చేసింది. భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త జరిపే శృంగారం అత్యాచారంగా పరిగణించబడుతుందా లేదా అనేదే ఈ కేసులో ప్రధానాంశం. ప్రస్తుతం చట్టం ప్రకారం భార్య వయసు 18 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే లైంగిక సంపర్కం అత్యాచారంగా పరిగణించబడదు. దీనిని వైవాహిక అత్యాచారం నుంచి చట్టపరమైన మినహాయింపు అని అంటారు.
పిటిషనర్ల వాదన
అయితే పిటిషనర్ల వాదన దీనికి భిన్నంగా ఉంది. వివాహం అయినంత మాత్రాన భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెపై లైంగిక సంబంధాన్ని బలవంతంగా రుద్దే హక్కు భర్తకు ఉండదని పిటిషనర్లు వాదించారు. భర్త తన భార్యకు తీవ్రమైన హాని కలిగించినట్లయితే కేవలం వైవాహిక బంధం ఉందన్న కారణంతో అతడిని క్రిమినల్ బాధ్యత నుంచి మినహాయించకూడదని వారు వాదిస్తున్నారు. వైవాహిక బంధంలో భర్తపై అత్యాచార అభియోగం మోపకుండా అడ్డుకునే చట్టపరమైన మినహాయింపును తొలగించాలని వారు కోర్టును కోరారు.