బెంగళూరు, సెప్టెంబర్ 9: ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత సీఎన్ఆర్ రావుకు కర్ణాటకలో ‘సర్’ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో ఆయన పేరులో తేడా ఉందని నోటీసులో పేర్కొన్నారు. దీనిని సవరించుకోవడానికి బెంగళూరు మల్లేశ్వరానికి రావాలంటూ 92 ఏండ్ల శాస్త్రవేత్తను ఆదేశించారు. 2002 ఓటరు జాబితాలో ఆయన పేరు ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు అని ఉండగా కొత్త రికార్డులలో కూడా ఆయన పేరు ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు అని ఉన్నప్పటికీ ప్రొఫెసర్ స్పెల్లింగ్‌లో ఒక ఎఫ్ అక్షరం అదనంగా ఉందని పేర్కొంది. దీనిపై రావు కార్యాలయం వివరణ ఇస్తూ సర్‌కు సంబంధించి తమకు ఎలాంటి నోటీసు అందలేదని తెలిపింది. ఆన్లైన్లో నోటీస్ జారీ అయిన సంగతి తమకు తెలియదని పేర్కొంది. కాగా, సర్ ప్రక్రియ పేరుతో రాహుల్ ద్రావిడ్, ప్రకాశ్ రాజ్, రామ్ జెఠ్మలానీ, రాఘవ్ చద్దా లాంటి ప్రముఖుల పేర్లను ఓటరు జాబితాలోంచి తొలగించడం ఇప్పటికే వివాదాస్పదమైంది.
నీలేకని, కుటుంబ సభ్యుల పేర్లు మిస్సింగ్
కర్ణాటకలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో భాగంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, కుటుంబ సభ్యుల పేర్లు మొత్తం అసమానతల జాబితాలో చేర్చనున్నారు. వీరి పేర్లు చివరి సర్‌తో మ్యాప్ చేయనందున వీరికి త్వరలోనే నోటీసులు జారీచేసే అవకాశం ఉంది. 2002 ఓటరు లిస్టులో పేర్లు లేని వారిని ఈ జాబితాలో చేరుస్తారు. నిర్దేశించిన 11 పత్రాలలో ఒకదానిని ఎన్నికల అధికారులకు సమర్పిస్తే వారిని తుది ఓటరు జాబితాలో చేరుస్తారు. కాగా, అక్టోబర్ 27న తుది ఓటరు లిస్టును ముద్రిస్తారు.